3 నెలల్లో సీవరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్టు పూర్తిచేయాలి
ఇప్పటికే 92 శాతం పనులు పూర్తి
4, 5, 6 డివిజన్‌లోని మురుగు సమస్యకు పరిష్కారం
ఎస్‌టిపికి మళ్లించి శుద్ధి చేయనున్న జలమండలి
– ప్రాజెక్టు పనులను సందర్శించిన ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : సీవరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్టు వివిధ ప్రాంతాల్లో నిర్మాణదశలో ఉన్న పనులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మంగళవారం సందర్శించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నింబోలి అడ్డా వరకు ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో నిర్మిస్తున్న సీవర్ ట్రంక్ మెయిన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మొదటగా కింగ్‌కోటి, కాచిగూడ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి.. పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులలో వేగం పెంచి 40 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అవసరమైతే రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టాలని అన్నారు. కాగా, కింగ్‌కోటి వద్ద 35 మీటర్ల విస్తరణ పూర్తి అయ్యిందని, మ్యాన్‌హోల్ నిర్మాణం చేపడుతామని అధికారులు వివరించగా.. ఏకకాలంలో పనులు చేపట్టి 40 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాచిగూడ వద్ద 200 మీటర్ల మేరకు చేపట్టిన పైపు విస్తరణ పనులు పూర్తి కాగా, ఇక్కడి రెండు ప్రాంతాలలో రెండు వారాల్లో మ్యాన్‌హొళ్లను పూర్తిచేయాలని అన్నారు. అనంతరం కాచిగూడ చౌరాస్తా నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్ వరకు రోడ్డు అంతర్భాగంలో నిర్మించిన ట్రంక్ మెయిన్ మ్యాన్‌హోళ్లపై సీసీరోడ్డు, రోడ్డు డివైడర్‌లు నిర్మించడంతో వాటి గుర్తింపు కష్టతరంగా మారిందని అధికారులు ఎండీకి నివేదించారు. దీంతో కాచిగూడ నుంచి రైల్వేస్టేషన్ వరకు అధికారులతో కలిసి పర్యటించారు. సమీపంలోని షాపు యజమానులతో మ్యాన్‌హోళ్ల వివరాలను అడిగి, ఏయే ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల నిర్మాణం జరిగిందో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. తీసుకున్న సమాచారంతో మ్యాన్‌హోళ్లను గుర్తించి డీ-సిల్టింగ్ పనులు చేపట్టి.. అంబర్‌పేట్ ఎస్‌టిపికి అనుసంధానం చేయాలని అధికారులకు ఎండీ ఆదేశించారు. బషీర్‌బాగ్ వద్ద మిగిలిన 200 మీటర్ల టన్నెలింగ్ పనులు ఆగష్టులో మొదలుపెట్టాలని ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. పనులు జరిగే సమయంలో రక్షణ చర్యలు పాటించాలని, వర్షాకాలం నేపథ్యంలో పనులు జరిగే ప్రాంతంలో బారీకేడ్‌లు ఉండేలాగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ప్రాజెక్టు జీఎం కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీవెరేజ్ టన్నెలింగ్ ప్రాజెక్టు ( సీవర్ ట్రంక్ మెయిన్ ) స్వరూపం :
జలమండలి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నింబోలి అడ్డా వరకు నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టులో రాజ్‌భవన్.. సచివాలయం నుంచి అబిడ్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడా, బర్కత్‌పురా, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లోని మురుగు నీటిని నాలాలో కలవకుండా అంబర్‌పేట్ ఎస్‌టిపికి మళ్లించడానికి దాదాపు 5 కిలోమీటర్ల 1800 ఎంఎమ్ డయా భారీ పైప్‌లైన్ నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఈ పైప్‌లైన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నింబోలి అడ్డా అక్కడి నుంచి అంబర్‌పేట్ వరకు పైప్‌లైన్ విస్తరణ పనులకు పూనుకుంది. కాగా రద్దీగా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ పైప్‌లైన్ అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ ద్వారా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అలా 2007 అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 4.4 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ పనులు పూర్తి చేసింది. అయితే చాలా ప్రాంతాల్లో భూగర్భంలో పరుపుబండ తేలడంతో టన్నెలింగ్ పనులు ముందుకు సాగక ఆలస్యం కావడం.. ప్రాజెక్ట్ వ్యయం పెరిగి సదరు ఏజెన్సీ అలాగే వదిలేసింది. ఈ ప్రాజెక్టు మిగిలిన 0.35 కిలోమీటర్లు పూర్తి చేస్తే జలమండలి ఓ అండ్ ఎం 4, 5, 6 ప్రాంతాల్లోని రాజ్ భవన్, సచివాలయం, అబిడ్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడా, బర్కత్‌పురా, బాగ్‌లింగంపల్లి తదితర మురుగును నాలాకు చేరకుండా అంబర్‌పేట్ ఎస్‌టిపికి మళ్లించి శుద్ధి చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే మురుగు పొంగి రోడ్లపైకి రాకుండా కట్టడి చెయ్యవచ్చు. అలాగే తరుచూ ఎంసీసీకి వచ్చే సీవరేజ్ ఫిర్యాదులూ తగ్గే అవకాశం ఉంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply