USA: బ్రౌన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి భయాందోళనలు సృష్టించింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు.

ఈ దారుణ ఘటన యూనివర్సిటీలో పరీక్షలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకుంది. ఓ దుండగుడు అకస్మాత్తుగా క్యాంపస్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

ఈ ఘటనపై నగర మేయర్ స్పందిస్తూ, కాల్పులకు పాల్పడిన దుండగుడిని పట్టుకోవడానికి విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. క్యాంపస్‌తో పాటు పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు తక్షణమే అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది తమ ఫోన్లను సైలెంట్ మోడ్‌లో ఉంచుకోవాలని, తాము ఉన్న గదుల డోర్లను లోపలి నుంచి గట్టిగా లాక్ చేసుకోవాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది క్యాంపస్‌లోని ప్రతి భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఈ ఘటనతో బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు, గాయపడిన వారి ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాల్పుల వెనుక కారణాలు, దుండగుడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అమెరికాలో విద్యా సంస్థల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కావడంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page