కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కెటిఆర్
ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 2, ( అద్దం న్యూస్ ) : ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు చూపుతున్నారని, రాష్ట్రంలో శిఖండి పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వంద రోజుల గ్యారంటీలకు మంగళం పాడారని.. వెయ్యి రోజులు ప్రజలను నిలువెత్తున ముంచారని, తెలంగాణకు పట్టిన శనికి నేటితో వెయ్యి దినాలు అని కెటిఆర్ అన్నారు. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం ఇది అని, వంద రోజుల్లోనే స్వర్గం చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపారని.. రేవంత్ భాషలో.. ఈ వెయ్యి రోజులు ఒక క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై తెలంగాణ భవన్‌లో బుధవారం ఛార్జ్ షీట్‌ను కెటిఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సురభి వాణీదేవి, ఎల్ రమణ, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, కేఆర్ సురేష్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైందని…డిసెంబర్ 7న పీడ దినాలు మొదలయ్యాయన్నారు. నాలుగు పడగలతో బుస కొడుతున్న అనుముల నాగుపాము పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. రైతన్నలను రాచి రంపాన పెడుతున్న రాక్షస పాలన అని, నిరుద్యోగులను నిండా ముంచిన నికృష్ణ పాలన ఇది అని అన్నారు.
మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలన్నారు.. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నారు… నిన్న సెక్రటేరియట్ వేల మంది ఉద్యోగులు బయటికొచ్చి ఆందోళన చేశారన్నారు. ఇస్తవా.. చస్తవా.. అని సీఎంను బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ విఫల పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది ? అని అన్నారు. ఉద్యోగులకు ఉత్త చేతులు చూపారు.. దళితులను దగా చేశారని కెటిఆర్ దుయ్యబట్టారు. బహుజనులను మోసం చేసిన బడుద్ధాయిల పాలన ఇది అని, మైనారిటీలకు ధోకా మాత్రమే మిగిలిందన్నారు. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నారని, అనుముల అనుయాయులు, పొంగులేటి అనుచరులు.. రాష్ట్రంలో భూములు కొల్లగొడుతున్నారని విమర్శించారు. 22-ఏ పేరిట కోట్లాది ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని.. ఆనాడు రేవంత్ గురువు తెలంగాణను నిషేధించాడని.. ఈయనేమో తెలంగాణ కోటి ఎకరాల మాగాణను నిషేధించాడన్నారు. ఒక్కో ఎకరానికి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. కమీషన్లు, పర్సంటేజీల అవినీతి అరాచక పాలన ఇది అని అన్నారు. కేసీఆర్ చెప్పినట్టే.. మళ్లీ యూరియా కోసం చెప్పుల లైన్లు వచ్చాయని..లగచర్లలో హీర్యానాయక్ అనే రైతును సంకెళ్లు వేసి జైల్లో పెట్టారన్నారు. రైతన్నలు గుండె పగిలి వరిధాన్యాల కుప్పల మీదనే చనిపోయారని..తడిసిన ధాన్యంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. భారతదేశంలోనే అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ మనదని… దేశానికే అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని, లాఠీలు, లూటీలు, నేరాలు, ఘోరాలు, వెకిలి మాటలు, మకిలి చేతలు, ఢిల్లీకి మూటలు.. మంత్రివర్గంలో తన్నులు, కీచులాటలు.. ఎంగిలి విస్తర్ల కాడ కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్టుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తన్నుకుంటున్నారని, రైతులకు ఏం చెప్పారు ? ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. అన్నదాత జేబులు కొట్టి.. రాహుల్ గాంధీ జేబులు నింపుతున్నాడని, కాళేశ్వరం మీద కక్ష, రైతన్నకు శిక్ష
నీళ్లున్నా ఎత్తిపోయడం లేదన్నారు. రూ.200 కోట్లు మిస్ వరల్డ్ పోటీలకు పెట్టారని.. మెస్సీ ఫుట్ బాల్ ఆటకు రూ.100 కోట్లు పెట్టారన్నారు. అందులో 5 శాతం ఖర్చు పెట్టినా కాఫర్ డ్యాం కట్టేవారు నీళ్లు ఎత్తిపోయాలని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే.. బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తానని… చర్లపల్లి జైల్లో వేస్తానని రేవంత్‌రెడ్డి బెదిరించాడని కెటిఆర్ అన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే నానా యాగీ చేశారని… మూడు చెక్ డ్యాంలను పేల్చివేసిన విధ్వంస ప్రభుత్వం ఇది అని, పెద్ద వాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయిందన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది.. రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నేటికీ మృతదేహాలు తీయలేని దుస్థితి నెలకొందన్నారు. వట్టెం పంప్ హౌస్ మునిగింది.. చెక్ డ్యాములు పటాకుల్లా పేలుతున్నాయని, మీ అవినీతి రాజ్యానికి ఇంతకంటే సాక్ష్యం ఏంటి ? అని అన్నారు.













Leave a Reply