డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి

డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి
– రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి
– డీజీపీ సివి.ఆనంద్‌ ను కలిసి వినతి పత్రం అందజేసిన టీడీపీ తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్‌, జూలై 18, ( అద్దం న్యూస్ ) :     రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సివి.ఆనంద్ ను టీడీపీ తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ కోరారు. ఈ మేర‌కు శ‌నివారం డిజిపిని కలిసిన అర‌వింద్ కుమార్ విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సందర్భంగా టీడీపీ తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాక్లెట్లలో డ్రగ్స్ కలపడంతో స్కూల్స్ కాలేజీల విద్యార్థులు డ్రగ్స్ కు బానిసవుతున్నారన్నారు. మత్తు పదార్థాల కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ( ఈగల్ )–2025 గణాంకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. డ్రగ్స్ బారిన పడుతున్న వారిలో 35 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నుండి 25 ఏళ్ల వయసు వారు 39.4 శాతం, 26 నుండి 35 ఏళ్ల వయసు వారు 26.4 శాతం డ్ర‌గ్స్‌కు అల‌వాటుప‌డుతున్నార‌న్నారు. పెరుగుతున్న నేరాలకు అత్యాధునిక సాంకేతికత అవసరమని తెలిపారు.

గంజాయి, డ్రగ్స్, మద్యానికి బానిసలైన వారి వల్లే సమాజంలో నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల చిత్ర పరిశ్రమకు చెందిన వారితో పాటు ప్రజాప్రతినిధులు సైతం డ్రగ్స్ కేసుల్లో అరెస్టవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ద్వారా ‘ హాష్ ఆయిల్ ‘ రూపంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని, వీటిని అడ్డుకునేందుకు పోలీసు శాఖ అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. డ్రగ్స్ రవాణా, సరఫరా వెనుక ఎంతటి ఐశ్వర్యవంతులు లేదా ప్రభావశీలురు ఉన్నా సరే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వినియోగదారులకు కేవలం శిక్షలే కాకుండా, కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైన పునరావాస కార్యక్రమాలు ( Rehabilitation ) నిర్వహించాలన్నారు. ‘ నశా ముక్త్ తెలంగాణ ‘, ‘ సే నో టు డ్రగ్స్ ‘ వంటి నినాదాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో ఫలితాలిచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు సమష్టిగా కృషి చేయాలని అరవింద్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తెలుగుదేశం పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page