బహుజన కార్మిక సంఘంలోకి రాజిరెడ్డి సహా పలువురు నేతలు
హైదరాబాద్, ఆగస్టు 4, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య మాట్లాడుతూ… తమ ఆహ్వానం మేరకు నేడు తమ యూనియన్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య నుండి కొమిరెల్లి రాజిరెడ్డి సహా పలువురు నాయకులు చేరడం పట్ల వారికి సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. గతంలో తమ సంఘం నుండి ఎన్నో ఉద్యమాలు నిర్వహించి, ఒక పెద్ద యూనియన్‌కు ట్రేడ్ యూనియన్ నాయకత్వంతో పాటు జేఏసీని ఏర్పాటు చేసి కన్వీనర్‌గా ముందుకు సాగామని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పలువురు నాయకులు యూనియన్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు పోరాటంలో ముందు వరుసలో నిలబడతామని, అందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ లేబర్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి అన్ని యూనియన్లు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం అధ్యక్షుడు ముని రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఏవి.రావు, ఎన్‌వి.చారి, వినాయక రెడ్డి, హుస్సేన్, ఎమ్మెస్ రావు, లింగస్వామి, పర్వతాలు జంగయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply