TGSRTC : హనుమకొండ, వ‌రంగ‌ల్ డిపోలను ఆకస్మిక తనిఖీలు చేసిన టిజిఎస్ ఆర్టీసి విసి, ఎండి వై.నాగిరెడ్డి

హనుమకొండ, వ‌రంగ‌ల్ డిపోలను
ఆకస్మిక తనిఖీలు చేసిన టిజిఎస్ ఆర్టీసి విసి, ఎండి వై.నాగిరెడ్డి

వ‌రంగ‌ల్, ఆగ‌స్టు 4, ( అద్దం న్యూస్ ) : వరంగల్, హనుమకొండ ప్రధాన బస్టాండ్లు, హనుమకొండ డిపోలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్ ఆర్టీసి ) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, డిపో నిర్వహణ, మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ నగర ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ‘ PM eBus Sewa ‘ పథకం కింద మరో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయ‌న‌ వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్ రీజియన్‌లో 112 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. బస్టాండ్లలో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మహిళా ప్రయాణికుల భద్రత, వెయిటింగ్ హాళ్ల నిర్వహణ, బస్సుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమైన నాగిరెడ్డి బస్సు రూట్లు, ఆక్యుపెన్సీ నిష్పత్తి, ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సురక్షితమైన, నాణ్యమైన ప్రయాణాన్ని అందించడమే సంస్థ ప్రధాన ధ్యేయమని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రయాణికులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ 9 వేలకుపైగా బస్సుల ద్వారా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రజా రవాణా సేవలను మరింత ఆధునీకరించి, ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజశేఖర్, చీఫ్ సివిల్ ఇంజినీర్ కవిత, వరంగల్ రీజినల్ మేనేజర్ భవానీ ప్రసాద్‌తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page