Sunday, September 27, 2026
No menu items!
HomeAPబిసి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ ను తొలగించాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

బిసి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ ను తొలగించాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) :     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి క్రిమిలేయర్‌ను తొలగించాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో వివిధ శాఖలకు చెందిన బీసీ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ… విద్యా, ఉద్యోగ నియామకాల బిసి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బిసిల పై వివక్షను, చిన్న చూపు చూస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుందని అన్నారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవన్నారు. రాజ్యాంగ బద్ధమైన మండల్ కమిషన్ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందన్నారు. చట్టబద్దమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఆరు రిజర్వేషన్ల వర్గాలు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎన్‌సీసీ, మహిళ రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ ఒక బిసిలకే ఎందుకు విధించారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల లక్ష్యం ఆర్ధికాభివృద్ధి కాదు, పేదరిక నిర్మూలన పథకం కాదు పాలనలో బిసిలకు భాగస్వామ్యం కల్పించడం ఒకటైతే.. రిజర్వేషన్ల ద్వారా చదువు, ఉద్యోగం తద్వార అధికారంలో ఈ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి సామజిక హోదా పెంచడం ఇంకొక భాగమ‌న్నారు.

అధికారంలో వాటా కల్పించినప్పుడే పేదకులాలకు సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం బిసి ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పింద‌న్నారు. అన్ని వైపుల నుంచి బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సులున్నాయని, ప్రమోషన్లలలో రిజర్వేషన్లు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు లేవన్నారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రంలో బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 34 సంవత్సరాలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బిసిల శాతం 17 శాతం దాటలేదన్నారు. ఇవ్వని గ్రేడ్ స్థాయి ఉద్యోగాలలో 9 శాతం దాటలేదని… సివిల్ సర్విస్ ఐఏఎస్‌ ఉద్యోగాలలో 7 శాతం దాటడం లేదన్నారు. ఇవన్ని పరిశీలిస్తే ప్రమోషన్లలలో రిజర్వేషన్లు పెడితే తప్ప బిసిలు ఉన్నత ఉద్యోగులకు రాలేరన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ బిసి ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎం.శ్రీనివాస్ రావు, రాష్ట్ర బిసి ఉద్యోగుల సంఘం ఆర్గ‌నైజింగ్‌ సెక్రటరీ కోట పిచ్చయ్య, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ రావు, రామాంజనేయులు, విద్యార్ధి సంఘం కన్వీన‌ర్‌ మోడీ రాందేవ్, పృధ్విరాజ్ గౌడ్, ప్రీతం, నరేష్ గౌడ్, నిఖిల్ పటేల్, నవీన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page