హైదరాబాద్, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) : నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ( GNITS ) లో సాగుతున్న ప్రైవేట్ బౌన్సర్ల గుండాయిజం, రూ.లక్షల సీట్ల దందాను తక్షణమే అరికట్టాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్ట బబ్లూ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్లోని ప్రముఖ మహిళా విద్యాసంస్థ అయిన జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( GNITS ) లో మేనేజ్మెంట్, ఎన్నారై ( NRI ) కోటా సీట్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలు, నిరంకుశ పోకడలను జాతీయ బీసీ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యా సరస్వతి నిలయంగా ఉండాల్సిన కళాశాలను యాజమాన్యం వ్యాపార సముదాయంగా, అరాచక స్థావరంలా మార్చేసిందన్నారు. ఒక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రైవేట్ బౌన్సర్లను రంగంలోకి దించాల్సిన అవసరం ఏమి వచ్చింది ? అని ప్రశ్నించారు. తమ హక్కుల కోసం, న్యాయమైన సీట్ల కేటాయింపు కోసం ప్రశ్నించడానికి వచ్చిన కన్నబిడ్డలను, వారి తల్లిదండ్రులను శారీరకంగా నెట్టివేస్తూ, భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న బౌన్సర్లను తక్షణమే కాలేజీ ప్రాంగణం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
కనీసం ప్రాథమిక నిబంధన అయిన స్పాన్సర్షిప్ లెటర్ ( Sponsorship Letter ) కూడా లేకుండా, అసలైన ఎన్నారైలకు కాకుండా కేవలం స్థానిక నివాసితులకు ఈ సీట్లు ఎలా కేటాయిస్తారు ? అని బబ్లూ గౌడ్ అన్నారు. నిబంధనలను, మెరిట్ వ్యవస్థను పూర్తిగా తుంగలో తొక్కి ఈ అర్హత లేని కేటాయింపులు జరిపారన్నారు. ఒక్కో ఎన్నారై కోటా సీటును రూ.20 లక్షల నుండి రూ.25 లక్షల వరకు, సాధారణ ‘ బి-కేటగిరీ ‘ ( మేనేజ్మెంట్ ) సీట్లను సైతం రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల వరకు అదనపు రేట్లకు బహిరంగంగా అమ్ముకుంటున్నారన్నారు. ప్రతిభ ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ మేనేజ్మెంట్ సీట్లను వేలంపాటలా మార్చడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ( TGCHE ), సాంకేతిక విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, కళాశాలలో జరిగిన ‘ బి-కేటగిరీ ‘, ఎన్నారై అడ్మిషన్లపై సమగ్ర విచారణ జరపాలని, పారదర్శకత లేకుండా జరిగిన అన్ని అక్రమ సీట్ల కేటాయింపులను రద్దు చేసి, మెరిట్ జాబితా ప్రకారం అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. విద్యార్థినులను, తల్లిదండ్రులను భయపెట్టిన యాజమాన్యంపై, సదరు ప్రైవేట్ ఏజెన్సీ బౌన్సర్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు, కళాశాల ప్రాంగణం నుండి బౌన్సర్లు వెళ్లే వరకు జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
