తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయి – తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు ఉన్నాయి
– తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్, డిసెంబ‌ర్ 13, అద్దం న్యూస్ :      తెలంగాణ ప్రజలు అన్ని వయస్సుల వారిలోనూ అపారమైన ప్రతిభ, కష్టపడే స్వభావం, వ్యాపార నైపుణ్యాలు కలిగి ఉన్నారని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఏఐజి హాస్పిటల్స్, గచ్చిబౌలిలో శ‌నివారం నిర్వహించిన టిటిఏ-ఐఎంఏ కన్వెన్షన్– 2025 ప్రారంభ‌మైంది. ఈ టిటిఏ-ఐఎంఏ కన్వెన్షన్–2025 ద్వారా క్లినికల్ ప్రాక్టీసెస్‌లో నూతన మార్పులు, సాంకేతికత పాత్ర, ప్రజారోగ్య బాధ్యతలపై విస్తృత చర్చ జరిగింది. వైద్య రంగంలో నైతికత, నవోన్నత సేవలు, సమాజానికి సేవ అనే లక్ష్యాలను ఈ కన్వెన్షన్ మరోసారి బలపరిచింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని ప్రసంగించారు. తాను సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చానని, ఈ కాలంలో అన్ని వయస్సుల తెలంగాణ తెలుగు ప్రజలతో అనేకసార్లు మమేకమయ్యానని గవర్నర్ తెలిపారు. ప్రతి ఒక్కరిలోనూ ఎదగాలనే తపన, వ్యాపారవేత్తలుగా మారాలనే ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తోందని, ముఖ్యంగా తెలంగాణలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోందని ఆయన అన్నారు. ఉత్తర– ఈశాన్య రాష్ట్రాల్లో ఇంత లోతైన ప్రజాప్రవేశం ఇంకా పూర్తిగా జరగాల్సి ఉందని పేర్కొన్నారు.

తాను గతంలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఏఐజి హాస్పిటల్స్ గురించి విన్నానని, తూర్పు రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థ మంచి గుర్తింపు పొందిందని గవర్నర్ తెలిపారు. ఏఐజి హాస్పిటల్స్‌ను ఎవరు స్థాపించారో అని అప్పట్లో అనుకునేవాడిని… డాక్ట‌ర్‌.దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గురించి తెలిసిన తర్వాత, ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులే ఇలాంటి వైద్య సేవల్ని, అద్భుత సంస్థలను నిర్మించగలరని అనిపించిందని గవర్నర్ ప్రశంసించారు.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని, భారతరత్న డాక్ట‌ర్‌.బిధాన్ చంద్ర రాయ్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధం ఉన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

వైద్యం, డయాగ్నస్టిక్స్‌లో ఏఐ ( ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ ) పాత్ర విస్తరిస్తోంది : డాక్ట‌ర్‌ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి

ఏఐజి హాస్పిటల్స్ ఛైర్మన్, గ్యాస్ట్రోఎంటరాలజీ గురువుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్ట‌ర్‌. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ….వైద్యం, డయాగ్నస్టిక్స్ రంగాల్లో కృత్రిమ మేధ ( ఏఐ ) పాత్ర వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. ఏఐ సాంకేతికత ద్వారా నిర్ధారణ ఖచ్చితత్వం పెరుగుతోందని, క్లినికల్ నిర్ణయాలకు ఇది వైద్యులకు బలమైన తోడ్పాటుగా మారుతోందని చెప్పారు. వైద్య నైపుణ్యం మరియు సాంకేతికత సమన్వయం భవిష్యత్తు వైద్య వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తుందని ఆయన అన్నారు.

టిటిఏ – ఐఎంఏ కలిసి తెలంగాణ ప్రజలకు సేవలు : డాక్ట‌ర్‌.జయపాల్ రెడ్డి

అమెరికా నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరైన టిటిఏ అడ్వైజరీ కో– చైర్ డాక్ట‌ర్‌.జయపాల్ రెడ్డి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకంగా కరోనా మహమ్మారి సమయంలో టిటిఏ మాతృభూమి తెలంగాణ రాష్ట్రానికి అందించిన వైద్య సహాయం, సేవా కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకోసం ఎంఓయూ కుదుర్చుకునేందుకు టిటిఏ – సిద్ధంగా ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.

టిటిఏ తో కలిసి ప్రజలకు వైద్య సేవలు : డాక్ట‌ర్‌.కిషన్ పోరండ్ల

ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కిషన్ పోరండ్ల మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ఐఎంఏ లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా టిటిఏ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండటం, అందుకోసం ఎంఓయూ కుదుర్చుకోవడం ఎంతో ఆనందకరమని ఆయన అన్నారు. ఈ సహకారం ద్వారా తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.

ఐఎంఏ దేశవ్యాప్త సేవలు : డాక్ట‌ర్‌.దిలీప్ భానుశాలి

ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.దిలీప్ భానుశాలి మాట్లాడుతూ… ఐఎంఏ ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సంస్థ అని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఐఎంఏ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పివి టీకా కార్యక్రమం, డ్రైవర్లు, సాధారణ ప్రజలలో అవగాహన కార్యక్రమాలను ప్రస్తావించారు. వచ్చే జనవరి నుంచి పిల్లలకు ఈ టీకా కార్యక్రమాన్ని విస్తరించేందుకు ఐఎంఏ ప్రణాళిక సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ డాక్ట‌ర్‌.దయాల్ సింగ్, టిటిఏ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.నవీన్ మల్లిపెడ్డి, డాక్ట‌ర్‌.పివి.రావు, టిటిఏ-ఐఎంఏ ప్రతినిధులు, సీనియర్ వైద్యులు, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిపుణులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page