Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADచిన్న బార్లపై ప్రతిపాదిత ప్రివిలేజ్ ట్యాక్స్‌ను తక్షణమే రద్దు చేయాలి

చిన్న బార్లపై ప్రతిపాదిత ప్రివిలేజ్ ట్యాక్స్‌ను తక్షణమే రద్దు చేయాలి

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :    ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రివిలేజ్ ట్యాక్స్ విధానాన్ని పునఃసమీక్షించి పెద్ద బార్లు, పబ్బులు, చిన్న బార్లను వేర్వేరు కేటగిరీలుగా విభజించి నిబంధనలు రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రతిపాదన అమలైతే చిన్న బార్లపై ఏటా రూ.30 లక్షల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వ‌ద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బార్ & రెస్టారెంట్ వ్యాపారాన్ని కాపాడండి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ప్రస్తుతం బార్ & రెస్టారెంట్ యజమానులు అధిక లైసెన్స్ ఫీజులు, నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, పోటీ వ్యాపార పరిస్థితులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.

ఇప్పటికే వ్యాపార నిర్వహణ కష్టంగా మారిన పరిస్థితుల్లో కొత్తగా ప్రివిలేజ్ ట్యాక్స్ విధించాలనే ప్రతిపాదన యజమానులపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని సంఘం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పర్మిట్ రూమ్‌లు నిబంధనలకు విరుద్ధంగా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేసి ఆహార విక్రయాలు నిర్వహిస్తున్నాయని బార్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజులు చెల్లిస్తూ, సిబ్బంది జీతాలు, అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు భరిస్తూ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్న బార్ & రెస్టారెంట్లపై ఇటువంటి పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. అందువల్ల సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు ( GO.), ఎక్సైజ్ నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్‌లు నిర్వహించబడేలా అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నచోట చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. స్టార్ హోటళ్లు, పబ్బులు, ప్రీమియం బార్లకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని, సాధారణ బార్ & రెస్టారెంట్లకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేసి, వాటి ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ, అధిక ఆదాయ సామర్థ్యం కలిగిన ప్రీమియం బార్లకు మాత్రమే తగిన ప్రమాణాల ఆధారంగా ప్రివిలేజ్ ట్యాక్స్ విధించే అంశాన్ని పరిశీలించాలని, తక్కువ లాభాల మార్జిన్లతో నడుస్తూ, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ బార్ & రెస్టారెంట్లపై ప్రతిపాదిత ప్రివిలేజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర‌స‌న ధ‌ర్నాలో సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.రాజు గౌడ్‌, క‌ల్లుగీత సంఘం నాయ‌కుడు అయిలి వెంక‌న్న గౌడ్‌, ఉపాధ్య‌క్షుడు శ్రీనివాస్ గుప్త‌, కోశాధికారి మోహ‌న్‌గౌడ్, కార్య‌ద‌ర్శి పి.న‌ర్సింగ్‌రావు, ప‌ర్మ‌య్య‌, వెంక‌టేష్ గౌడ్‌, రాజు గౌడ్‌, రాజు, ర‌మేష్ గౌడ్‌, ల‌క్ష్మీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page