Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅమ్మే మృత్యువై తోసేస్తే.. ఆపద్బాంధవులై కాపాడారు !

అమ్మే మృత్యువై తోసేస్తే.. ఆపద్బాంధవులై కాపాడారు !

📰 Generate e-Paper Clip

సాగర్‌లో మునిగిపోతున్న ఆరేళ్ల పసిపాపను రక్షించిన ముగ్గురు పౌరులు
– ప్రాణదాతలకు నగర సీపీ సజ్జనర్‌ ఘన సత్కారం, నగదు పురస్కారం

బషీర్‌బాగ్‌, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :    హుస్సేన్‌సాగర్‌లో మునిగిపోతున్న ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్న చిన్నారికి తక్షణమే ఆపన్నహస్తం అందించి ప్రాణదాతలుగా నిలిచిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేటు ఉద్యోగి కె.బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌లకు శాలువాలు కప్పి, నగదు పురస్కారాలను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళకు ఎనిమిదేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆరేళ్ల చిన్నారి గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, రోజురోజుకూ పెరిగిపోతున్న చికిత్స ఖర్చులను భరించలేక తీవ్ర నిస్సహాయత, మానసిక క్షోభకు లోనైన తల్లి విచక్షణ కోల్పోయింది. కన్న కూతురిని చంపేయాలనే కర్కశ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇటీవ‌ల ఇద్దరు పిల్లలను అప్పర్ ట్యాంక్‌బండ్‌కు తీసుకొచ్చిన ఆమె, ఐస్‌క్రీమ్ తీసుకురావాలని పెద్ద కుమార్తెను పక్కకు పంపించింది. అనంతరం ఎవరూ గమనించని సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆరేళ్ల చిన్నారిని హుస్సేన్‌సాగర్‌లోకి తోసేసి అక్కడి నుంచి పరారైంది. నీటిలో పడిన చిన్నారి అక్కడున్న వెదురు కర్రను పట్టుకుని ప్రాణభయంతో ‘ కాపాడండి. మా అమ్మ నన్ను నీటిలో తోసేసింది ’ అంటూ కేకలు వేసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న బోరబండ మోతీనగర్ కు చెందిన కె.బాలకృష్ణ చిన్నారి ఆర్తనాదాలను మొదటగా గమనించి రోడ్డుపై వెళ్లేవారిని కేకలు వేస్తూ అప్రమత్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న బేగంపేట ప్రకాశ్ నగర్ నివాసి ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, అక్కడ రద్దీని చూసి వాహనాన్ని నిలిపివేశారు. నీటిలో మునిగిపోతున్న చిన్నారిని చూడగానే ఆయన క్షణాల్లో నీటిలోకి దూకారు. నాచారానికి చెందిన మహ్మద్ అఫ్సర్ సహాయంతో ఆ పాపను నీటిలోంచి పైకి తీసుకొచ్చి రోడ్డు పైకి చేర్చారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తల్లిపై దోమలగూడ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ నగర సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న తోటి మనిషిని చూసి సాయం చేయాల్సింది పోయి, చేతుల్లోని మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే రోజుల్లో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి సమాజానికే ఆదర్శమని కొనియాడారు. బాలకృష్ణ అప్రమత్తం చేయడం, ఫక్రుద్దీన్, మహ్మద్ అఫ్సర్ నీటిలోకి దూకి ఆ పసిపాపను కాపాడిన తీరు అత్యంత ప్రశంసనీయమని, ఇలాంటి సామాజిక బాధ్యతను, మానవతా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయ‌న పిలుపునిచ్చారు.  పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక భారాన్ని తెచ్చినప్పటికీ.. నిస్సహాయతతో కన్నబిడ్డల ప్రాణాలు తీయడం పరిష్కారం కాదు. కష్టమొచ్చినప్పుడు నైరాశ్యంతో చేతులెత్తేయకుండా.. సమాజం, ప్రభుత్వ వ్యవస్థల సహాయం కోరాలే తప్ప ఇలాంటి కర్కశ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుంది. ప్రాణాల కంటే ఏదీ విలువైనది కాదు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ ( లా అండ్ ఆర్డర్ ) తప్షీర్ ఇక్బాల్, అదనపు సీపీ ( క్రైమ్స్ ) ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీ ( ట్రాఫిక్ ) జోయల్ డేవిస్, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, గాంధీనగర్ ఏసీపీ యాదగిరి, దోమలగూడ ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page