...

నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది – టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు

నైతికతలేని జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుంది

మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలి
నాయకత్వ స్థానాల్లోకి మహిళా పాత్రికేయులు రావాలి
  •  టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యుజే సెమినార్‌లో వక్తలు

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : నైతికతలే జర్నలిజం విశ్వసనీయత కోల్పోతుందని ఎన్‌డీటీవీ తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌ అన్నారు. గృహిణిగా ఇంటి పనులు చేస్తూనే బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా మహిళలు రాణించాలని సూచించారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టీడబ్యూజేఎఫ్‌), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యూజే) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గల త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘జర్నలిజం- మహిళలు- సవాళ్ళు’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడబ్ల్యూజేఎఫ్ ‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. రాధిక అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమా సుధీర్‌ మాట్లాడుతూ.. జర్నలిజం సులువు కాదనీ, మహిళలకు మరింత కష్టమన్నారు. పురుషాధిక్యత రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగడం అంత సులువు కాదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యాలను ఆమె ప్రస్తావిస్తూ.. జర్నలిస్టులకు ప్రత్యేక హక్కులంటూ ఏవీ లేవని చెప్పారు. హద్దు మీరిన వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జర్నలిజాన్ని,జర్నలిజం విలవలను దిగజారుస్తుందన్నారు. మహిళా జర్నలిస్టులు ఎందరో కథలను చెప్పడమో, రాయడమో చేస్తూ ఉంటారని తెలిపారు. కథ అంటే వాస్తవానికి దగ్గరగా చెప్పటమని అన్నారు. మహిళా జర్నలిస్టుల స్వానుభవాలను చెబితే జర్నలిజంలోకి కొత్తగా వచ్చే వారికి ఎంతో స్ఫూర్తిగా ఉంటుందన్నారు. సీనియర్‌ జర్నలిస్టు స్వేచ్ఛ మాట్లాడుతూ… జర్నలిజం రంగం ఎంచుకొనే మహిళలు మానసిక స్థైర్యంతో ఉండాలని సూచించారు. సామాజిక సభ్యత, విలువలు కచ్చితంగా పాటించాలని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజం చెప్పినా నమ్మే పరిస్థితులు జర్నలిజానికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగాల మాదిరిగా జర్నలిజం కాదని, పలు మీడియా సంస్థల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండవని తెలిపారు. అందువల్ల మహిళలు జర్నలిజంలోకి ఎక్కువగా రావటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికీ భావస్వేచ్ఛ ఉందనీ, అందు వల్లనే సామాజిక మాధ్యమాల్లో ఎవరి ఆలోచనలను వారు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

స్వతంత్ర జర్నలిస్టు తులసీచందు మాట్లాడుతూ… సోషల్‌ మీడియాలో మహిళలపై వస్తున్న ట్రోలింగ్స్‌ను ఎదుర్కోవటం మహిళా జర్నలిస్టులకు ఎంతో కష్టంగా మారిందని చెప్పారు. ప్రజా సమస్యలపై నిత్యం అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. జర్నలిజంలో అన్ని విభాగాల్లో ప్రావీణ్యత సాధించాలని మహిళా జర్నలిస్టులకు ఆమె పిలుపునిచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే.సలీమా మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టులపై పనిఒత్తిడి పెరుగుతోందన్నారు. జర్నలిజంలో వస్తున్న మార్పులకనుగుణంగా జర్నలిస్టులు అప్‌డేట్‌ కావాలని సూచించారు. రాధిక మాట్లాడుతూ… ఫ్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో మహిళలు లీడర్లుగా ఎదగడం చాలా అరుదు అన్నారు. ఎన్నో సవాళ్ళను ఇంటా, బయట ఎదుర్కొవడంతో మహిళా జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. సీనియర్‌ జర్నలిస్టులు సురేఖ, కే.లలిత, వాణిపుష్ప, దివ్య, నవీన, భువన త‌దిత‌రుల‌కు శాలువాలు కప్పి సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా మణిమాల, విజయ, రోజారాణి పి.నాగవాణి వ్యవహరించారు. ఈ కార్యక్రంలో ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బండి విజయ్‌కుమార్‌, ఎల్గొయి ప్రభాకర్, గుడిగ రఘు, బి.రాజశేఖర్‌, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, హెచ్‌యూజే కార్యదర్శి బి.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నాయకులు మధుశ్రీ, సునీతతో పాటు పెద్ద ఎత్తున మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.