హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని, క్యాంపస్ భూములను లాక్కోవడాన్ని ఖండిస్తున్నామని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వాగ్దానం చేసి ఏడో గ్యారెంటీగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందన్నారు. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికమైన చర్య అని అన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం విద్యార్థులకు సరైన వసతులు, పరిశోధన కేంద్రాల కోసం వినియోగించుకోవాల్సిన 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరుతో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూ యూనివర్సిటీ భూములను బడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసం పూనుకుందన్నారు. ఈ చర్య వల్ల భవిష్యత్‌లో క్యాంపస్‌లో చదివే విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందనీ గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అయినప్పటికీని ప్రభుత్వం నియంత్రత్వ ధోరణితో పోలీసుల సహకారంతో యూనివర్సిటీలోకి అక్రమంగా చొరబడి జెసిబిలను తీసుకొచ్చి క్యాంపస్‌కు సంబంధం లేని పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా యూనివర్సిటీ భూముల వేలంకు వ్యతిరేకంగా మార్చి 30వ తేదీన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వారి క్యాంపస్ భూముల సంరక్షణకై శాంతియుతంగా జెసిబిలను అడ్డుకుంటూ ఆందోళన నిర్వహించారన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులపై లాఠీచార్జిని ప్రయోగించారని, హాస్టల్ గదిల్లోకి అక్రమంగా ప్రవేశించి విద్యార్థినీ, విద్యార్థులతో దుర్భాషలాడుతూ అత్యంత పాషవికంగా నెట్టుకుంటూ భయానక వాతావరణన్ని సృష్టించి అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులందరిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేలా, యూనివర్సిటీలో మోహరించిన పోలీసు బలగాలను వెనక్కి పంపాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూములను వెంటనే హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి విద్యార్థులకు ఇవ్వాలని, లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply