వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలి – జలమండలి సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం

వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలి  
♦ నాణ్యమైన నీటి సరఫరాకు చర్యలు
♦ హాట్ స్పాట్ల పై ప్రత్యేక దృష్టి సారించాలి
♦ 300 గజాలకుపైగా ఉన్న నివాసాల్లో ఇంకుడుగుంత తప్పనిసరి
♦ బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఆరా.. అండగా ఉంటామని వెల్లడి
– జలమండలి సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం

       స‌మావేశంలో మాట్లాడుతున్న హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

హైద‌రాబాద్‌, మే 28, అద్దం న్యూస్ :   ముందస్తు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం రోజున ఖైరతాబాద్‌లో జలమండలి కార్యాలయంలో వర్షాకాల ప్రణాళిక 90 రోజుల కార్యచరణ, పురోగతిలో ఉన్న పలుప్రాజెక్టు పనులపై జలమండలి ఎండీ.అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఉన్నత అధికారులతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన శుద్ధిచేసిన నీటిని సరఫరా చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. అలాగే సీవరేజ్ రహదారులపై సీవరేజ్ ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలాగా చూసుకోవాలని సూచించారు. ఇప్పటికే జలమండలి, జీహెచ్ఎంసీ 146 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించిందని, వాటిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. జలమండలి అధికారులు, సిబ్బంది 90 రోజుల కార్యాచరణ విజయవంతం చేసి, సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదులను 30 శాతం తగ్గించడంపై ఎండీతో సహా అందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ 90 రోజుల ప్రణాళికలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వేసవిలో 40 వేల వినియోగదారులు అధికంగా ట్యాంకర్లు బుక్ చేసినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో సర్వే చేస్తే వారి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించామన్నారు. వారందరికీ ఇంకుడు గుంటలు ఉంటే భూగర్భ జలాలు పెరిగి ఈ దుస్థితి రాకపోయేదని అన్నారు. 16 వేల మందికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా నోటీసులు జారీచేసి చేసినట్టు మంత్రి తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని 300 గజాల పైన ఉన్న ప్రతీ ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించడానికి ప్రతిఒక్కరూ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో దానిపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జలమండలి ఆర్థిక పరిస్థితిపై ఆరాతీసిన మంత్రి రెవెన్యూ పెంచుకోవడానికి, నీటి వృధాను అరికట్టడానికి, లీకేజీలను అరికట్టడానికి, ప్రజలలో నీటి వృధా తగ్గించేలా అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్రమ నల్లా కనెక్షన్లపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన, వివిధ శాఖలనుంచి జలమండలికి రావాల్సిన బకాయిలపై ముఖ్య మంత్రితో మాట్లాడుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వం బోర్డు తన కాళ్లమీద తాను నిలబడేలాగా అన్నీ రకాలుగా చేయుతనిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్‌ల‌ను వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. దానికనుగుణంగా తాగునీరు, మురుగునీటి శుద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి అన్నారు. అందులో భాగంగా 7వేల కోట్లతో గోదావరి ఫేస్ 2, 3 ప్రాజెక్టును పనులను చేపట్టిందని, మురుగునీటి శుద్ధికై 39 ఎస్టీపీలను నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రానున్న 30 ఏళ్ల వరకు నీటి అవసరాలకు భరోసా ఉంటుందని వివరించారు. ప్రజలకు నీటి సరఫరా, మురుగునీటి సమస్యలపై జలమండలి కస్టమర్కేర్ 155313 కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

భవిష్యత్తు ప్రణాళికను ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ :

జలమండలిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, బోర్డులోని వివిధ విభాగాలు.. పనితీరు, హైదరాబాద్ నగరానికి సరఫరా చేస్తున్న వివిధ ప్రాజెక్టులు, ఎస్టీపీలు, రెవెన్యూ ఆదాయ వ్యయాలతోపాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రాజెక్టులపై జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ప‌వర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే 90 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 అక్టోబర్ 2 న ( గాంధీ జయంతి ) ప్రారంభించామని, నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న మురుగునీటి సమస్యలతో పాటు రోజూ వారీగా వచ్చే ఫిర్యాదులను సైతం తగ్గించడం, భూగర్భ జలాల పెరుగుదలకు ఇంకుడు గుంతలు నిర్మించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టకుండా, ఉన్న వనరులనే ఉపయోగించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమం సత్ఫ‌లితాలను ఇస్తోందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి బోర్డు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోందని చెప్పారు. జీఐఎస్ ఆధారిత మొబైల్ యాప్తో పాటు ప్రత్యేక డాష్బోర్డ్ ఏర్పాటు చేసి ప్రధాన కార్యలయం నుంచే ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 3600 కిలో మీటర్ల మురుగునీటి పైపులైన్, 3 లక్షల మ్యాన్ హోళ్లలో వ్యర్థాల తొలగించి శుభ్ర పర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అయితే ఇప్పటి వరకు 24650 ప్రాంతాల్లో మొత్తం 3,261.84 కి.మీ మురుగునీటి పైపులైన్లు, 2.54 లక్షల మ్యాన్‌హోళ్ల‌ల్లో డీ-సిల్టింగ్ చేసినట్టు వివరించారు. దీనివల్ల నగరంలో 30 శాతం సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదులు తగ్గినట్టు ఈ సందర్భంగా ఎండీ వివరించారు. అలాగే ఈ 90 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ఇంకుడు గుంతలను సైతం నిర్మించాలని జలమండలి సంకల్పించిందని అన్నారు. ఎండిపోయిన 58 బోర్‌వెల్ల‌ చుట్టు 41 ఇంకుడు గుంతలను జలమండలి నిర్మించింది… వీటిని బోర్డు నిధులతో నిర్మించారని చెప్పారు. ఇవే కాకుండా.. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ప్రాంగంణం కలిగి ఇంకుడు గుంతలు లేని వినియోగదారులు వాటిని నిర్మించుకునేలా లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. అలాగే ఇంకుడు గుంతలు లేని వినియోగదారులకు.. వాటిని నిర్మించుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నట్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు కావాల్సిన సహాయ సహకారాలను ఎన్జీవోలు ఇస్తున్నట్లు అన్నారు. జలమండలి ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన మార్గదర్శకత్వంలో.. ఇప్పటిదాకా 102 మంది వినియోగదారులు తమ ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్లు వివరించారు. ఇవే కాకుండా వేసవి కార్యచరణ, వర్షాకాల కార్యచరణ ప్రణాళిక, కొత్త ప్రాజెక్టులు, పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ప్రాజెక్టులపై జలమండలి ఎండీ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి, కోర్సిటీ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, ట్రాన్స్మిషన్ అధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page