సికింద్రాబాద్ పేరును మాయం చేయనివ్వం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ పేరును మాయం చేయనివ్వం
– సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఉద్యమిస్తాం
» మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, జనవరి 09, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్‌కు ఉన్న 220 సంవత్సరాలకు పైగా చరిత్రను చెరిపివేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్‌తో పాటు కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, వ్యాపార–వాణిజ్య–కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, ఆఫీసుల్లో కూర్చుని గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా డివిజన్ల విభజన చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 150 డివిజన్లను 300కు పెంచి హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ పేర్లతో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు అహింసా మార్గంలో దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మొదటి దశగా ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు బాలం‌రాయ్‌లోని లీ ప్యాలెస్‌లో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. అలాగే 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, పాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం స్టేషన్ ముట్టడి చేస్తామని వెల్లడించారు. అవసరమైతే బంద్‌లు, ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. “ ముఖ్యమంత్రికి దమ్ము ఉంటే హైదరాబాద్ పేరు మార్చాలి ” అంటూ సవాల్ విసిరారు. సికింద్రాబాద్ పేరును తొలగించి వేరే పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పలు సంఘాల సంపూర్ణ మద్దతు :

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన ఉద్యమానికి పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సుమారు 35కి పైగా సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరై తమ తీర్మాణాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌లకు అందజేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారిగా తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతామని సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అన్ని వర్గాలు, అన్ని పార్టీలను కలుపుకొని సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని తలసాని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page