ఈ నెల 19 నుంచి 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
– ఎన్‌టిఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన
– తెలుగు ప్రముఖులు అందెశ్రీ, అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లతో వేదికలు
హైదరాబాద్, డిసెంబర్ 13, అద్దం న్యూస్ : తెలంగాణ సాహితీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు అద్భుత రీతిలో, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. పుస్తకం విశిష్టత, దాని ప్రయోజనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ అంతిమ లక్ష్యమని ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కవి యూకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి మాట్లాడారు. పుస్తకాన్ని, దాని ప్రాముఖ్యతను సమాజానికి తెలియజెప్పడంతో పాటు, మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈసారి పుస్తక విక్రయాలు, కొనుగోళ్లతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. పుస్తక స్ఫూర్తి కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో బాలోత్సవం ( పిల్లల కోసం ప్రత్యేక సెషన్లతో పాటు పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు.
తాజాగా హైదరాబాద్‌పై జాతీయ స్థాయిలో వచ్చిన పుస్తకాలపై ప్రత్యేక సెషన్ ఉంటుందని తెలిపారు. బాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిపై ప్రత్యేక సెషన్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణాలు, వేదికలకు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సాహిత్య రంగానికి విశేష కృషి చేసిన ప్రజాకవి అందెశ్రీ, సృజనకారిని అనిశెట్టి రజిత, కొంపల్లి వెంకట్ గౌడ్, ప్రొఫెసర్ ఎస్‌వి.రామారావు, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఒటారికర్ పేర్లను కమిటీ చర్చించి, విజ్ఞాపనల తర్వాత నిర్ణయించామన్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రజాకవి అందేశ్రీ ప్రాంగణంగా పేరు పెట్టామని, ప్రధాన వేదికకు సృజనకారిని అనిశెట్టి రజిత పేరు, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్‌గౌడ్, రైటర్స్ పాయింట్ ( రైటర్స్ స్టాల్స్ ) కు ప్రొఫెసర్ ఎస్‌వి.రామారావు పేరు, మీడియా పాయింట్ ( జర్నలిస్ట్ స్టాల్స్ )కు ప్రముఖ దివంగత జర్నలిస్ట్ స్వేచ్ఛ ఒటారికర్ పేర్లను పెట్టడం జరిగిందన్నారు.![]()

![]()












Leave a Reply