తార్నాక, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) : వయసు చదువుకు అడ్డంకి కాదని లాలాపేటకు చెందిన మహిళా సంఘాల సభ్యులు చాటి చెప్పారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మధ్య 45 రోజుల పాటు రాత్రివేళల్లో అక్షరాలు నేర్చుకున్న మహిళలు ఆదివారం ఉల్లాస్ పరీక్షకు హాజరై తమ చదువు నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప్ నంబర్–6లో నిర్వహించిన పరీక్షను ఉత్సాహంగా రాశారు. మహిళా సంఘాల సభ్యుల్లో అక్షరాస్యత పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నూతన భారత అక్షరాస్యత కార్యక్రమం–ఉల్లాస్’ను తెలంగాణలో ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు 45 రోజుల పాటు చదవడం, రాయడంపై శిక్షణ ఇచ్చారు. పరీక్ష అనంతరం మహిళలు తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌ఎఫ్ ఆర్‌పీ దోమకొండ సులోచన, అధ్యక్షురాలు ఎస్.విజయలక్ష్మి, కో–ఆర్డినేటర్ ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అక్షరాల కోసం 45 రోజులుగా శ్రమ – ఉల్లాస్ పరీక్ష రాసిన లాలాపేట మహిళా సంఘాల సభ్యులు
RELATED ARTICLES

