బిసిలకు సర్పంచ్ సీట్లు ఇవ్వకుంటే మీ సీఎం సీటు గుంజుకుంటాం
డిసెంబర్ 8, 9 న పార్లమెంట్‌ను ముట్టడిస్తాం
జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రథయాత్ర నిర్వహిస్తాం
ఫిబ్రవరిలో లక్షలాది బిసిలతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం
– బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, నవంబర్ 30, అద్దం న్యూస్ : కాంగ్రెస్, బిజెపిలు బిసీలను నమ్మించి నయవంచనకు గురి చేశాయని, మీరు మాకు సర్పంచ్ సీటు ఇవ్వకుంటే, మేము మీ సీఎం సీటు గుంజుకుంటామని బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించే బాధ్యత బిజెపిదే అని, డిసెంబర్ 8, 9 న పార్లమెంట్‌ను ముట్టడిస్థామని జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రథయాత్ర నిర్వహిస్తామని, ఫిబ్రవరిలో లక్షలాది బిసీలతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని అన్నారు. ఆదివారం తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన ఛలో హైదరాబాద్ పిలుపు మేరకు బీసీల రాజకీయ యుద్ధ బేరి మహాసభ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగింది. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ శాసన మండలి పక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ క్రాంతి అధ్యక్షుడు పృద్వి రాజ్ యాదవ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిసి జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బిజెపిలు పార్టీ పరంగా ఇస్తామన్న 42 శాతం టికెట్లు కూడ బూటకమని తేలిపోయిందన్నారు. అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్లాల్సిందే, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రిజర్వేషన్లు తగ్గించిన తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ ఏ ముఖంతో వస్తాడో చూస్తామని జాజుల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం తగ్గకుండా కుట్ర చేస్తున్నారని, బీసీలు సర్పంచ్‌లుగా కాకుండా ఓర్పులను కోర్టులను వేదికలుగా చేసుకుని బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు బీసీల నోటికాడు ముద్దను లాగేసుకున్నారని ఆయన మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని నమ్మించి మోసగించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, అసెంబ్లీలో మద్దతిచ్చి కేంద్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా బీసీలను నయవంచన చేసిన చరిత్ర బిజెపికే దక్కుతుందని ఫైర్ అయ్యారు. సర్పంచ్ సీటు ఇవ్వని అగ్రకులాల సీఎం సీటు ను గుంజుకుందామని, వచ్చే 2028 ఎన్నికలు బీసీ లు అంత ఐక్యమై రాజకీయ అధికారం సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 42 శాతం చట్టబద్ధంగా ఇస్తామన్న రిజర్వేషన్లు ఏమో కానీ, గత ఎన్నికలలో కల్పించిన 23 శాతం రిజర్వేషన్లను ప్రస్తుతం తగ్గించి 17 శాతానికి కుదించారాని, బీసీలకు రిజర్వేషన్లు అన్యాయం జరిగిందని సాక్షాత్తు బీసీ కమిషన్ సీఎంకు లేక రాసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సి మధుసూదనాచారి లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బుద్ధి కుక్క తోక వంకర లాంటిదని, నెహ్రు కాంగ్రెస్ నుండి రాహుల్ కాంగ్రెస్ వరకు బీసీలను దగా చేసినవాల్లే అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు అమలు కోసం రాజ్యాంగ సవరణ జరిగే వరకు పోరాటం ఆపొద్దన్నారు. బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎవరు సాటి లేరని, నాటిని ఎవరూ కాంగ్రెస్ నుండి నేటి రాహుల్ కాంగ్రెస్ వరకు బీసీలకు ద్రోహం చేశారని, కుక్క తోక వంకర అన్న చందంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బుద్ధి మారలేదని వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బిజెపిలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, బీసీల పట్ల ఏమాత్రం వారికి చిత్తశుద్ధి ఉన్న ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్దత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని వారు ప్రకటించారు.
బిసి జేఏసి పోరాటానికి మద్దతును ప్రకటించిన ఎంపి ఈటల రాజేందర్ :
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగిన మహాసభకు ఫోన్ ద్వారా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సందేశం అందించారు బీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి తన వంతుగా పూర్తి మద్దతు ఉంటుందని, బీసీలకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగిన మోసాన్ని బీసీలు గ్రహించి, ప్రస్తుతం జరిగే సర్పంచ్ ఎన్నికలలో జనరల్ స్థానాలను కూడా బీసీలు బరిలో ఉండి గెలిపించుకొని బీసీల రాజకీయ ఐక్యతను చాటాలని ఈటెల రాజేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, బిసి జేఏసీ కో– చైర్మన్ శేఖర్ సగర, జేఏసీ నేతలు బిటి మల్లయ్య, వీరస్వామి, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్, జిల్లాల నరసింహ, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, వడ్లకొండ వేణుగోపాల్, దాసరి ఉష, డాక్టర్ రూపన రమేష్, మెట్టు బంగారం, జుర్రిగల శ్రీనివాస్, ఎక్కాల దత్తు, నాగుల కనకయ్య, నల్ల సోమ మల్లయ్య, ఈగ శ్రీనివాస్ గౌడ్, తారకేశ్వరి, శివమ్మ, బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగ గౌడ్, ఓయూ జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామి, రావులకోల్ నరేష్ ప్రజాపతి, పాలకూరి కిరణ్ తదితరులు ప్రసంగించారు.![]()

![]()
