...

పుస్తకం అనేది జ్ఞాన దీపం – మంత్రి జూపల్లి కృష్ణారావు

పుస్తకం అనేది జ్ఞాన దీపం

నిర్వహణకు రూ.3 కోట్లు .. గ్రంథాలయాలకు పుస్తకాల కోసం కోటి మంజూరు

పుస్తక ప్రదర్శనలను జిల్లాలకు విస్తరిస్తాం – మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌ ప్రారంభం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 19, అద్దం న్యూస్ :     పుస్తకం అనే జ్ఞానదీపం సమాజంలోని అజ్ఞానాన్ని, రుగ్మతలను తొలగించి కొత్త వెలుగును ప్రసాదిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ సమాజంలో మార్పు తీసుకురావడానికి పుస్తక పఠనం ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని ఆకాంక్షించారు. శుక్రవారం హైద‌రాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో ప్రారంభమైన 38 వ హైదరాబాద్‌ బుక్ ఫెయిర్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన అనంత‌రం… పునాస మ్యాగ‌జైన్‌ ఆవిష్కరించారు.  ప్రభాత భేరి కరపత్రం… కాలెండర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేటి కాలంలోనూ ఏటా 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభపరిణామన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, ఇది మనిషిని సంస్కరించలేకపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “నాటి తరం ఆలోచనా విధానం, విలువలు నేడు కల్తీ అయిపోయాయి. కేవలం ఉద్యోగం, సంపాదన ధోరణిలో పడి మానవ జన్మ సార్థకతను మర్చిపోతున్నామ‌న్నారు. పాత కాలపు సంస్కారం మళ్లీ రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శనలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జూపల్లి వెల్లడించారు. ఇందుకోసం సాంస్కృతిక శాఖ ద్వారా రూ.3 కోట్లు ( జిల్లాకు రూ.10 లక్షల చొప్పున ) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, గ్రామీణ, మండల స్థాయి గ్రంథాలయాలకు మంచి పుస్తకాలను చేరవేయడానికి తక్షణమే రూ. కోటి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో సామాజిక చైతన్యం నింపేందుకు త్వరలోనే ‘ ప్రభాత భేరి ‘ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.గత పదేళ్లలో అప్పులు రూ. 64 వేల కోట్ల నుంచి రూ.8 లక్షల కోట్లకు పెరిగాయని, ఏటా రూ.75 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలపై కొత్త పన్నులు వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. యువత తమ తల్లిదండ్రులకు కనీసం సంతకం చేయడం, చదవడం నేర్పించాలని, అది మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శాశ్వత స్థలం కేటాయించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పుస్తకం.. ఎప్పటికీ ఎండిపోని జ్ఞాన గంగ : ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సి కోదండరాం

 ప్రొఫెసర్‌, మాజీ ఎమ్మెల్సి కోదండరాం మాట్లాడుతూ… సోషల్‌ మీడియా ఇచ్చే సంతృప్తి తాత్కాలికమని, పుస్తకం ద్వారా లభించే జ్ఞానం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు.  ఒక పుస్తకాన్ని చదవడం అంటే చరిత్రలోకి ప్రయాణించడమేనని, మనం నేరుగా కలవలేని ఎంతో మంది మహానుభావులతో సంభాషించే అద్భుత అవకాశం దీనివల్ల కలుగుతుందని వివరించారు. ఈ ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరు పెట్టడం హర్షణీయమన్న ఆయన.. పశువులు కాసుకునే స్థాయి నుంచి కేవలం పుస్తక పఠనం ద్వారానే ఆయన గొప్ప సాహితీవేత్తగా ఎదిగారని గుర్తు చేశారు. భౌతిక పుస్తకాన్ని తాకుతూ, ఆ వాసనను ఆస్వాదిస్తూ చదివినప్పుడు కలిగే అనుభూతి డిజిటల్‌ మీడియాలో సాధ్యం కాదని, ఎన్ని సాంకేతిక మార్పులు వచ్చినా పుస్తక ప్రాధాన్యం తగ్గదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాను దప్పిక తీర్చలేని నీటి బుడగతో పోల్చిన ఆయన.. పుస్తకం ఎప్పటికీ ఎండిపోని స్వచ్ఛమైన జ్ఞాన గంగ అని అభివర్ణించారు. ఆధ్యాత్మికత, టెక్నాలజీ, చరిత్ర, సాహిత్యం వంటి అన్ని రకాల పుస్తకాలు ఒకేచోట లభించే ఈ ప్రదర్శనను నగర వాసులు కుటుంబ సమేతంగా సందర్శించి విజయవంతం చేయాలని కోరారు.

పుస్తకం.. విజ్ఞాన సముద్రాన్ని దాటించే నావ :  ప్ర‌ముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి

 ప్ర‌ముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ… పుస్తక పఠనం అంటే కేవలం చదవడం మాత్రమే కాదని, అది ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడమని  పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రులు లేదా మంత్రులు ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలను ప్రారంభించడం ఒక మంచి సంప్రదాయమన్నారు. తన జీవితమంతా వార్తాపత్రికల ప్రపంచంలోనే గడిచిందని, నేటికీ  లేదా డిజిటల్ తెరల కంటే పుస్తకాన్ని భౌతికంగా స్పృశిస్తూ చదవడమే తనకు అమితమైన సంతృప్తినిస్తుందని వెల్లడించారు. ఈ ప్రదర్శన కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చిన ప్రముఖ ప్రచురణకర్తల పుస్తకాలతో విజ్ఞాన గనిలా ఉందని కొనియాడారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని ఈ ప్రదర్శనకు రావాలి. వారికి చిన్నతనం నుంచే పుస్తకాలను పరిచయం చేయడం ద్వారా గొప్ప విజ్ఞానాన్ని అందించినవారవుతారని సూచించారు. ఈ పది రోజుల ప్రదర్శనలో నిత్యం మూడు నుంచి నాలుగు చొప్పున మొత్తం 40 పుస్తకాలు ఆవిష్కృతం కావడం విశేషమన్నారు. శక్తి, నవ తెలంగాణ వంటి ప్రచురణలతో పాటు బాల సాహిత్యానికి ఇక్కడ పెద్దపీట వేశారని తెలిపారు. జ్ఞానం అనేది ఒక అనంతమైన మహాసముద్రం వంటిదని, ఆ సముద్రపు లోతులను అన్వేషించడానికి పుస్తకాలు మనకు పడవల్లా ( నావల్లా ) సహాయ పడతాయని రామచంద్రమూర్తి అభివర్ణించారు. పుస్తక ప్రియులందరూ ఎక్కువ సమయం ఇక్కడ గడిపి, ప్రచురణకర్తలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 హైదరాబాద్ బుక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ యాకూబ్  అధ్యక్షత వహించిన  ఈ సభలో తెలంగాణ భాషా సంస్కృతి సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ శాఖ చైర్మన్ డాక్టర్ రియాజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్ట‌ర్ బారాచారి, హైదరాబాద్ బుక్ సొసైటీ ప్ర‌ధాన‌ కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, బి.శోభన్ బాబు, కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు కె.సూరిబాబు, పి.నారాయణ రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.