కర్ల రాజేష్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
– ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, జనవరి 13, అద్దం న్యూస్ : అక్రమ నిర్బంధానికి గురై లాకప్ డేత్ అయిన కర్ల రాజేష్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ పోస్టుమార్టం చేసే సమయంలో వీడియో గ్రాఫర్‌ను ఎవరు తెచ్చారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు… ఆ అధికారాలు ఎవరికి ఉన్నాయి తదితర వివరాలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ముషీరాబాద్ తహశిల్థార్ కార్యాలయానికి మందకృష్ణ వచ్చారు. ఈ సందర్భంగా తహశిల్థార్ రాణా ప్రతాప్‌ను కర్ల రాజేష్ కు సంబంధించిన పోస్టుమార్టానికి సంబంధించి వివరాలను, వీడియో గ్రాఫర్ ను ఎవరు తీసుకువచ్చారు.. మీ సమక్షంలోనే అయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో గాంధీనగర్ ఏసిపి యాదగిరి, దోమలగూడ సిఐ అంజద్ అలీ లు సైతం అక్కడికి వచ్చారు. వారిని సైతం మందకృష్ణ పోస్టుమార్టం సమయంలో వీడియో గ్రాఫర్‌ను ఎవరు తీసుకురావాలని తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం మీడియా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ…. రాజేష్ మృతికి పోలీసు వ్యవస్థతోపాటు హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వైద్యులు, గాంధీ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని అన్నారు. ముమ్మాటికీ కర్ల రాజేష్ ను పోలీసులు అక్రమ నిర్బంధంలో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం వలనే అనారోగ్యానికి గురై గాంధీ ఆసుపత్రిలో మరణించాడని, దీనికి పూర్తి కారణం చిలుకూరు మండల ఎస్సై సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం, అప్పటి కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి లే అని ధ్వజమెత్తారు. సూర్యాపేట ఎస్పీ నుండి మొదలు డీజీపీ వరకు ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నరే తప్ప వాళ్ళు దినిని అంగీకరించడం లేదని, దానికి కారణం వాళ్ళ పోలీసులే ఈ నేరం చేయడం వలన వారిని కాపాడుతున్నారని, ఉన్నతాధికారులు కాపాడుతున్నరనేది మేము రుజువుచేయగలమన్నారు. లాకప్ డెత్ గావించిన ఒక వ్యక్తికి పోస్టుమార్టం మెజిస్ట్రేట్ పరిధిలోనే జరగాలి… ఇందులో ఏ ఒక్క పోలీసు జోక్యం ఉండకూడదు… కానీ 16వ తేదీన మరణించిన రాజేష్ వద్దకు గాంధీ ఆసుపత్రి పరిధి వచ్చే ముషీరాబాద్ మెజిస్ట్రేట్ ఎమ్మార్వో 17వ తేదీన వచ్చారని, రాజేష్ పోస్టుమార్టం ఇప్పుడు ఎవరిపైన అయితే నేరం ఉన్నదో చిలుకూరు ఎస్సై, కోదాడ రూరల్ సిఐలు ఇందులో జోక్యం చేసుకోవడం జరిగిందన్నారు. దానికి సాక్ష్యం నివేదిక కోసం తీసుకునే పోస్టుమార్టం వీడియోకు వీడియో గ్రాఫర్ ఇక్కడి వ్యక్తి కోదాడ మయూరి ల్యాబ్ కు సంబంధించిన రామకృష్ణారెడ్డిని ఇక్కడికి రప్పించారన్నారు. ఈ రామకృష్ణారెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి బంధువన్నారు. పోలీసుల చిత్రహింసల వలనే రాజేష్ అనారోగ్యానికి గురయ్యాడని… అంతకు ముందు అతనికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి లేదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
ఆస్పత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే రాజేష్ మరణించాడు, తహశిల్దార్ సకాలంలో స్పందించకుండా నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి పోస్టుమార్టంలో జోక్యం అవ్వడానికి కారణమయ్యాడని విమర్శించారు. ఎమర్జెన్సీ పేషంట్‌గా గాంధీ ఆసుపత్రికి వచ్చిన రాజేష్ ను 50 నిమిషాల పాటు ఒక్క డాక్టరు కాని, నర్సు కాని పట్టించుకోలేదని.. ఇది ఆస్పత్రి సిసి ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పోలీసులు గాంధీ ఆసుపత్రి వైద్యులచే రాజేష్ కు షుగర్ ఉన్నదని, స్మోకర్ అని, డ్రింకర్ అని లేని అలవాట్లను అంటగడుతూ రాయించారని నిన్న గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ తెలిపారని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఇలా రాజేష్ విషయంలో ప్రతి వ్యవస్థ నిర్లక్ష్యం కనిపిస్తుందని, అందుకే మేము జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలు తప్పు చేస్తే శిక్షిస్తాం కానీ పోలీసులు తప్పు చేస్తే కప్పిపుచ్చుకుంటాం అనే ధోరణిలో పోలీసు డిపార్ట్మెంట్ ఉండొద్దు కోదాడ విషయంలో ప్రజలు గమనిస్తున్నారని… డిపార్ట్మెంట్ పై నమ్మకం, గౌరవం ఉండాలంటే కోదాడ లాకప్ డెత్ లో ఉన్న పోలీసులపై శాఖ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. సస్పెండ్‌కు గురైన సీఐ ఒక బీసీ బిడ్డ. చిలుకూరు ఎస్సై రెడ్డి కావడం వలన అతన్ని సస్పెండ్ చేయలేదు, అప్పటి డీఎస్పీ రెడ్డి కాబట్టి శక్తివంతమైన విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఎస్సై ని కాపాడుతున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డ అయిన సిఐని మాత్రమే సస్పెండ్ చేశారన్నారు. అందుకే స్పష్టమైన విచారణకై జ్యుడీషియల్ విచారణనకు ఆదేశించాలని, హోంశాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి హైదరాబాద్ ఉపాధ్యక్షుడు నరసింహా మాదిగ, ఎంఆర్పిఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ గజ్జల రాజశేఖర్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు గండి క్రిష్ణ మాదిగ, ఎంఎస్ఎఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాదిగ, ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇటిక కిషన్, సీనియర్ నాయకులు ఇటిక కిషన్ మాదిగ, మేకల రాజు మాదిగ, గంగాధరి మహేష్ కుమార్ మదిగ, చింతల కుమార్ మాదిగ, బొట్టు మధు మాదిగ, గడ్డం రమే్‌ష మాదిగ, దశరథ్ మాదిగ, రోషన్ వినయ్ రావు మాదిగ, ముచ్చనపల్లి రాములు మాదిగ, మహంకాళి వెంకటయ్య మాదిగ, అడ్వకేట్, బిజెపి నాయకుడు వెంకటేష్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply