Friday, September 25, 2026
No menu items!
HomeGREATER HYDERABADబీసీ వెల్ఫేర్ శాఖలో ప్రమోషన్ల అక్రమాలపై విచారణ జరపాలి – బిసి సంక్షేమ సంఘం తెలంగాణ...

బీసీ వెల్ఫేర్ శాఖలో ప్రమోషన్ల అక్రమాలపై విచారణ జరపాలి – బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌

📰 Generate e-Paper Clip

బిసి వెల్ఫేర్ శాఖ‌లో నాన్-బిసి అధికారుల వ‌ల్ల‌నే బిసి ఉద్యోగుల‌కు అన్యాయం
– బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :    బిసి వెల్ఫేర్ శాఖ‌లో నాన్-బిసి అధికారుల వ‌ల్ల‌నే బిసి ఉద్యోగుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, బీసీ వెల్ఫేర్ శాఖలో ప్రమోషన్ల అక్రమాలపై విచారణ జరపాలని బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్ అన్నారు. హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌, బిసి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు సిహెచ్‌.రాజేంద‌ర్ ముదిరాజ్‌, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌గిళ్ల స‌తీష్ లు మాట్లాడుతూ… బీసీ వెల్ఫేర్ శాఖలో బీసీ అధికారులకు తగిన ప్రాతినిధ్యం లేదని, ఇతర సంక్షేమ శాఖల్లో ఆయా వర్గాలకు చెందిన అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. నాన్-బీసీ అధికారులు ఉండటం వల్ల బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, ప్రశ్నించే ఉద్యోగులపై ఒత్తిడి, మెమోలు, బదిలీలు వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీ వెల్ఫేర్ శాఖలో ఇటీవల జరిగిన ప్రమోషన్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

 ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై సమర్పించిన నివేదికలను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని, విచారణ కోరినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన నివేదికలు ప్రస్తుతం మంత్రి పేషీలో ఉన్నాయని, వాటిపై బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో అర్హత లేని వారికి పదోన్నతులు కల్పిస్తున్నారని, కొన్ని పోస్టులకు డబ్బులు/కమిషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న బీసీ వార్డెన్లను దూర జిల్లాలకు బదిలీ చేయడంపై అన్యాయ‌మ‌న్నారు. నల్గొండ, హన్మకొండ, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని DD పోస్టుల ప్రమోషన్లపై కూడా అనుమానాలు ఉన్నాయని, అర్హతలను పరిశీలించాలని కోరారు. వార్డెన్‌ DD తదితర పోస్టుల ప్రమోషన్లలో అర్హతలు, సీనియారిటీ, నిబంధనలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పదోన్నతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్‌లో జనరల్ మేనేజర్ పోస్టుకు సంబంధించిన నియామక ప్రక్రియపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న నీల వెంక‌టేష్

బీసీ వెల్ఫేర్ శాఖను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ను, సీఎస్‌ను కోరారు. బీసీ వెల్ఫేర్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ తదితర కీలక పోస్టుల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్‌లో కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. వార్డెన్లు, ABSWO లు, DD లు తదితర ఉద్యోగులకు న్యాయం జరిగేలా స్పష్టమైన, చట్టబద్ధమైన విధి విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లకు సంబంధించిన ఫైళ్లను మంత్రి స్థాయిలో పూర్తిగా పునఃపరిశీలించి, అర్హత లేని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీసీ ఉద్యోగులు, బీసీ సంఘాలు, కుల సంఘాలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ స‌మావేశంలో బిసి విద్యార్థి సంఘం క‌న్వీన‌ర్లు శివ కుమార్ యాద‌వ్‌, నిఖిల్ ప‌టేల్‌, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య‌ద‌ర్శులు అంజి గౌడ్‌, న‌రేష్ గౌడ్‌, అడ్వ‌కేట్ అసోసియేష‌న్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి న‌ర‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page