హైదరాబాద్, నవంబర్ 18, అద్దం న్యూస్ : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ” ప్రత్యక్ష నరకూపాలుగా ” మారాయని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా ఫైర్ అయ్యారు. బుధవారం దోమలగూడలోని టిడిపి హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ…. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సామాన్య పేద ప్రజలు ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా పొందలేని దుస్థితిని ప్రభుత్వం సృష్టించిందని అన్నారు. ప్రభుత్వం వైద్య వ్యవస్థలోని ప్రధాన లోపాలను సరిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, డాక్టర్లు లేకపోవడం, అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం వల్ల వేలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేద ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో పరిస్థితులు విషమంగా ఉన్నాయని, నీలోఫర్ ఆసుపత్రి వంటి కీలక వైద్యశాలల్లో రోజుకు వేలాది మంది రోగులు వస్తున్నా.. వారికి సరిపడా వైద్యం అందించలేక తిప్పి పంపుతున్నారని తెలిపారు. అదే విధంగా గాంధీ ఆసుపత్రిలో రోగులు మరణించినా సరైన పర్యవేక్షణ లేదని, ఎక్కడ చూసినా కేవలం నిర్లక్ష్యమే కనిపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చలికాలంలో ఆయాసము, ఛాతీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ రోగాలు వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో, ప్రభుత్వ వైఫల్యం మరింత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
పేదవాడికి వైద్యం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడటంతో, పేదవాడు ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తయారైందని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్భర పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి కేవలం ” కాలయాపన చేస్తూ కాలక్షేపం చేస్తోందని ” సాయిబాబా ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులతో సరైన సమీక్షలు సమావేశాలు నిర్వహించకపోవడం, అవసరమైన నిధులను మంజూరు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసారు. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన సౌకర్యాలు, డాక్టర్లు, మందుల కొనుగోలుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆసుపత్రుల పరిస్థితిని మెరుగుపరచేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రజలు నుండి ఆందోళన, ప్రజా కోపాన్ని ఎదుర్కొనక తప్పదని పి.సాయిబాబా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, భానుప్రకాష్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply