...

జ‌న‌గాంలో దూడ పై పెద్ద పులి పంజా – మండెల‌గూడంలో దూడ‌ను చంపి అదృశ్య‌మైన పులి

జ‌న‌గాంలో దూడ పై పెద్ద పులి పంజా
భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్న పులి
మండెల‌గూడంలో దూడ‌ను చంపి అదృశ్య‌మైన పులి
పులి కోసం రెస్క్యూ టీమ్ ప్ర‌య‌త్నాలు
ఏడు మండ‌లాల‌కు అల‌ర్ట్‌

జ‌న‌గాం, ఫిబ్ర‌వ‌రి 6, అద్దం న్యూస్ :   జ‌న‌గాం జిల్లాలో పులి పంజా విసిరింది. గ‌త మూడు రోజులుగా పెద్ద పులి భ‌యాబ్రాంతుల‌కు గురి చేస్తోంది. జ‌న‌గాంలోని మండెల‌గూడం గ్రామం, మ‌రిగ‌డి గ్రామాల మ‌ధ్య‌న గ‌ల న‌క్క‌బొక్క‌ల తండా, పోత‌రాజు తండాలో పులి గురువారం సంచ‌రించింది. మండెలగూడం గ్రామానికి చెందిన‌ పి.రాజు అనే రైతుకు చెందిన దూడ‌ను పోత‌రాజు తండాలో క‌ట్టేశాడు. ఈ దూడ‌ను పెద్ద‌పులి బ‌లితీసింది. గురువారం లింగాలఘనపురం మండలం కుందారం గ్రామంలో కనిపించిన ఈ పులి, అక్కడి నుండి రహదారి మార్గంలో సుమారు 28 కిలోమీటర్లు ప్రయాణించి, రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామంలో దూడ‌నె చంపింది. జనవరి 17న యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం సమీపంలో మొదటిసారిగా కనిపించినప్పటి నుండి ఈ పులి ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో తొమ్మిది పశువులను చంపింది. సుమారు రెండు నెలల క్రితం మహారాష్ట్ర నుండి రాష్ట్రంలోకి ప్రవేశించిందని భావిస్తున్న ఈ పులి, గత 20 రోజులుగా జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని అటవీయేతర ప్రాంతాలలో సంచరిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున మండెలగూడెం గ్రామంలో పి.రాజు అనే రైతుకు చెందిన దూడను పులి చంపేసింది. సమాచారం అందుకున్న స్థానిక అటవీ అధికారులు పులిని పట్టుకునే నిపుణులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పులి పాదముద్రల కోసం తనిఖీ చేశారు. ఇప్ప‌టికే 7 మండ‌లాల‌ను అధికారులు అల‌ర్ట్ చేశారు. త‌న వ‌ద్ద ఉన్న దూడ‌ను త‌న బందువు రాజుకు విక్ర‌యించి ప‌ది రోజులు కూడా కాలేద‌ని, పోత‌రాజు తండా వ‌ద్ద దూడ‌ను క‌ట్టేసామ‌ని, పెద్ద పులి దాడి చేసి దూడ‌ గొంతు వ‌ద్ద కొరికి ర‌క్తం తాగి… కొద్దిగా దూడ మాంసాన్ని తిని వెళ్లిపోయింద‌ని పి.రాజు  ” అద్దం న్యూస్ ” ప్ర‌తినిధికి తెలిపాడు. 

దిశ‌ను మార్చుకుంటున్న పులి :

తాజాగా జ‌న‌గాంలో ప‌రిస‌ర గ్రామాల్లో సంచ‌రిస్తున్న పులి మొదటగా, అది ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రయాణించి, ఆ తర్వాత వ్యతిరేక దిశలో వెళ్ళింది. జనవరి చివరి వారంలో, అది నైరుతి దిశగా కదిలింది, మూడు రోజుల క్రితం తూర్పు దిశగా వెళ్లింది. ఇప్పుడు ఉత్తర దిశగా కదులుతోంది.

పులి కోసం రెస్క్యూ బృందాలను మోహరింపు :

పులి కోసం తాడోబా-అంధారి, పుణె నుండి ప్రత్యేక పులి రెస్క్యూ బృందాలను మోహరించినట్లు అట‌వీ శాఖ అధికారిణి లావ‌ణ్య తెలిపారు. మండెల‌గూడం గ్రామం పోత‌రాజు తండాను అధికారులు సంద‌ర్శించారు. పులి దాడికి గురైన దూడ‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా లావ‌ణ్య మాట్లాడుతూ… ఇది జత కోసం లేదా తన భూభాగాన్ని ఏర్పరచుకోవడానికి తిరుగుతుంద‌ని, ఈ పులి వ‌య‌స్సు సుమారు నాలుగ‌న్న‌ర సంవ‌త్స‌రాలు ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు. జ‌నగాం జిల్లా గ్రామాల్లోని ప్ర‌జలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. మండెల‌గూడం పోత‌రాజు తండాలో దూడ‌ను చంపిన త‌ర్వాత ఈ పెద్ద పులి ఎర్ర‌గొల్ల ప‌హాడ్ గ్రామ శివారు నుంచి న‌ర్మెట్ట వైపు ప‌య‌నించ‌వ‌ద్ద‌ని లావ‌ణ్య అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. పెద్ద పులిని ప‌ట్టుకునేందుకు పాద‌ముద్ర ద్వారా ట్రాకింగ్ కొన‌సాగుతుందని, పులికి మ‌న వల్ల హానీ జ‌రుగ‌కుండా, అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు పులి నుంచి హాని జ‌రుగ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. తెల్ల‌వారు జామున 4 గంట‌ల స‌మ‌యంలో పులి యాక్టీవ్‌గా ఉంటుంద‌ని, ప్ర‌జ‌లు కూడా లైట్ ఉన్న ప్రాంతాల్లో తిర‌గాల‌ని, మ‌నిషి వంగ‌కుండా వెళ్లాల‌ని, పులిని చూడ‌గానే ప‌రుగెత్త‌కూడ‌ద‌ని, ఏదైనా శ‌బ్దం చేసుకుంటూ జ‌నాలు వెళ్లాల‌ని చెబుతూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న చేస్తున్నామ‌ని తెలిపారు. పులి ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ఉంటుంది కాబ‌ట్టి ఒక్క రోజు కంటే ఎక్కువ రోజులు పులి ఒకే ప్రాంతంలో ఉండ‌డం లేద‌ని, కాబ‌ట్టి ఆ ఒక్క రోజు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.