హైదరాబాద్, నవంబర్ 16, అద్దం న్యూస్ : యేచన్ చంద్ర శేఖర్, కోట దామోదర్ రచించిన వ్యాస చంద్రిక-1 ( శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమాహారం ) అవరోధాలే అవకాశాలు ( ప్రేరణాదాయకమైన నిజ సంఘటనలు ) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లక్డికాపూల్ లోని రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ,ప్రొఫెసర్ రవీందర్ రేనా, ఆర్ధికవేత్త, డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, దక్షిణాఫ్రికాలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మాజీ అడిషనల్ డైరెక్టర్ ( మధ్యాహ్న భోజన పథకం అమలు, పర్యవేక్షణ ) బి. సదానంద్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్, తెలంగాణ విద్యా శాఖ, ప్రభుత్వ సిటీ కాలేజి లైబ్రరీ శాఖాధిపతి, తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కుమార్ చేగొని పాల్గొన్నారు. మహతీ సాహితీ కవిసంగమం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ అడిగొప్పుల సదయ్యతో పాటు ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయురాలు, సాహితీవేత్త వరలక్ష్మి యనమండ్ర పుస్తక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యేచన్ చంద్ర శేఖర్ యొక్క “ వ్యాస చంద్రిక-1 ( శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమాహారం ) ” తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక అన్యోన్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. 40 వ్యాసాల సమగ్ర సేకరణగా విడుదలైన ఈ పుస్తకం కేవలం వ్యాస సంకలనం మాత్రమే కాదు, విజ్ఞాన పిపాసులకు ఒక విస్తృత విందు అని వక్తలు పేర్కొన్నారు. నేటి సమాజంలో సాంకేతికత, విజ్ఞానం, పరిశోధన రంగాలలో జరుగుతున్న అద్భుతమైన పరిణామాలు, ఆవిష్కరణలు, వాటి వెనుక భిన్నమైన, లోతైన సమాచారాన్ని చంద్రశేఖర్ అత్యంత నైపుణ్యంతో, విజ్ఞానపూర్వకంగా, సమగ్ర దృష్టితో చదువరులను ఆద్యంతం కట్టిపడేసేలా రసవత్తరంగా అందించారని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసాలు భారతదేశ అంతరిక్ష, రక్షణ, ఆరోగ్య రంగాల్లో సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు, నూతన టెక్నాలజీల వినియోగం గురించి వివిధ కోణాల నుంచి వెలికితీసిన విధానం యువతను శాస్త్రీయ ఆలోచనల వైపు ఆకర్షించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
27 వ్యాసాల సంకలనంగా ” అవరోధాలే అవకాశాలు ” అన్న శీర్షికతో కోట దామోదర్ రచించిన ఈ పుస్తకం అవరోధాలను ఎలా అవకాశాలుగా మార్చుకున్నారన్న వ్యక్తుల నేపధ్యాల్ని రేఖామాత్రంగా ఆవిష్కరించేవే అని అన్నారు. సాధారణ స్థాయి నుండి ఎవరెస్టు అంతటి శిఖరాలను తమ అకుంఠిత దీక్షతో చేరుకున్న విభిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తుల జీవిత గాధలను ఎంతో హృద్యంగా “ అవరోధాలే అవకాశాలు ” పుస్తకం ద్వారా తీసుకురావడం అభినందనీయం అన్నారు. ఇలాంటి ప్రేరణాదాయకమైన వ్యాసాలతో కూడిన ఈ పుస్తకాన్ని చదివడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, సాధారణ వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా లబ్ది పొందుతారని వక్తలు తమ సంపూర్ణ విశ్వాసం వెలిబుచ్చారు.
చివరగా పుస్తక రచయితలు యేచన్ చంద్ర శేఖర్, కోట దామోదర్ ముఖ్య అతిథులకు, ఆహూతులకు, సమావేశ మందిరాన్ని ఇచ్చి సహకరించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు సమర్పిస్తూ వందన సమర్పణ చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
Leave a Reply