చేనేత రంగం వస్త్ర పరిశ్రమ మాత్రమే కాదు.. భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయం
» మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, ఆగస్టు 7, ( అద్దం న్యూస్ ) : చేనేత రంగం వస్త్ర పరిశ్రమ మాత్రమే కాదు.. భారతదేశపు సంస్కృతి, సాంప్రదాయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రాంనగర్ లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో జరిగింది. అలయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత రంగానికి, సమాజానికి విశేష సేవలందించిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడాకారుడు కొండ సహదేవ్, కందగట్ల స్వామి, శ్రీనివాస సారి హౌస్ యజమాని యాదగిరి, వనం దుష్యంతల, గుంటక రూప తదితరులకు దత్తాత్రేయ ప్రశంసా పత్రాలిచ్చి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… మన పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు విధిగా చేనేత వస్త్రాలను ( Handlooms ) ధరించాలన్నారు. మనం కొనే ప్రతి చేనేత వస్త్రం వెనుక ఒక నేతన్న ఆకలి తీర్చే ధర్మం, మన సంస్కృతిని బతికించే ప్రయత్నం ఉందన్నారు. ఘనమైన వారసత్వానికి సజీవ రూపం అన్నారు. కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి, సబ్సిడీపై ముడిసరుకులు అందించాలన్నారు. మనమంతా కలిసి మన చేనేత కార్మికులకు అండగా నిలుద్దామని దత్తాత్రేయ పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో “ Vocal for Local – Local to Global ” భావనతో చేనేత రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 356 చిన్న చేనేత క్లస్టర్లు, 2 మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు, 5.34 లక్షల మంది చేనేత కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడం వంటి అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన “ చేయూత ” హామీలో చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్ అందిస్తామని ప్రకటించిన విషయాన్ని దత్తాత్రేయ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలకు పైగా గడిచిన నేపథ్యంలో ఈ హామీని అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, రాపోలు సత్యనారాయణ, గజివెల్లి నర్సింహా రాములు, కొక్కుల దేవేందర్, గుజ్జ సత్యం, చిక్క దేవదాసు, మంథెన దశరథ్, బోనం ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply