హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లల్లో బుక్స్ యూనిఫామ్స్ దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్‌కె లో జరిగిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపీడీ షురు అయ్యిందన్నారు. ఈ విద్యా సంవత్సరం 20-30 శాతం ఫీజులు పెంచడం సరికాదని… వీటికి అదనంగా పుస్తకాలు, బెల్ట్, టై, బ్యాడ్జీ, డ్రెస్సులు, బ్యాగు వంటి వస్తు సామాగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారిచ్చే మామూళ్లకు ఆశపడి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా జిల్లా విద్యాశాఖ అధికారి ఫీజులు పెంపు, పుస్తకాలు, డ్రెస్సులు, తదితర విక్రయాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు. విద్యావ్యవస్థ ఉన్నది విద్యా అందించేందుకుగానీ.. వ్యాపారం చేసుకోవడానికి కాదన్నారు. ఇకనైనా అధికారులు జీవో నెంబర్-1 ని సమర్థవంతంగా అమలు చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. నగరంలో ఏటా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న పాఠశాలలు.. ఎలాంటి గుర్తింపుతో సంబంధం లేకున్నా.. రకరకాల పేర్లతో ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఏటా ప్రతి ఏడాదీ నిలువు దోపీడీకి గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, నాగేందర్, శ్రీమాన్, స్టాలిన్, సహన సాయి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply