వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 2, ( అద్దం న్యూస్ ) : వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కాంగ్రెస్ ‘ ఆరు గ్యారెంటీలు ’ పచ్చి మోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో 420 అడుగుల భారీ బ్యానర్‌తో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదని అన్నారు. హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ముఠా గోపాల్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కుటుంబ ఆస్తుల పెంపుపై దృష్టి సారించారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన అబద్ధం, అరాచకం, అజ్ఞానం, అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్‌ఎస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ముఠా గోపాల్ అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ముఠా జైసింహా, ముచ్చకుర్తి ప్రభాకర్, పులిగిల్ల శ్రీధర్ చారి, కొండ శ్రీధర్‌రెడ్డి, కృపానంద్, శంకర్ ముదిరాజ్, ముఠా నరేష్, కరికె కిరణ్, చింటు, శోభ, మణి, స్రవంతి, ప్రమీల, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.














Leave a Reply