...

ఘ‌నంగా ప్రారంభ‌మైన బ్రిక్స్ ట్రేడ్ యూనియ‌న్ ఫోరం స‌మ్మిట్‌–2026

ఘ‌నంగా ప్రారంభ‌మైన
బ్రిక్స్ ట్రేడ్ యూనియ‌న్ ఫోరం స‌మ్మిట్‌–2026
– హాజ‌రైన 14 దేశాల 110 ప్ర‌తినిధులు

హైద‌రాబాద్‌, జూలై 14, ( అద్దం న్యూస్ ) :   ప్రపంచ కార్మిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ ఉపాధి అవకాశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియస్ ఫోరం ( BTUF ) సమ్మిట్ – 2026 మంగళవారం హైదరాబాద్‌లోని హోట‌ల్‌ మారియట్‌లో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండ వీయ, రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి సంయుక్తంగా సదస్సును ప్రారంభించారు. జూలై 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు కొనసాగనుంది. ఈ స‌మ్మిట్‌కు 14 దేశాల నుండి సుమారు 110 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెలారస్, మలేషియా, నైజీరియా త‌దిత‌ర దేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ… హ్యూమానిటీ ఫస్ట్ ( మానవతే ప్రథమం ) అనే భారతదేశ దృక్పథమే ప్రపంచ పరిపాలనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు ( AI ), డిజిటల్ సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి కార్మికులకు అనుకూలంగా ఉండాలని, మానవ గౌరవాన్ని కాపాడే విధంగా సమగ్ర సామాజిక భద్రత, డిజిటల్ సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల వరకు అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ… కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భరోసా కల్పించినప్పుడే పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, నైపుణ్యాభి వృద్ధి, భవిష్యత్ ఉద్యోగాలపై ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంద న్నారు. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను అధ్యయనం చేసి, వాటిలో ఉత్తమమైన వాటిని అన్ని దేశాలు అనుసరించేలా సిఫార్సులు రూపొందించడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. అనంత‌రం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్మికుల సదస్సు ( Workers’ Confluence ) లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ ఉద్యోగ వ్యవస్థ, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ కార్మిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టీసీ క‌ళాభ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ స‌మ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన భారత మాజీ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, మాజీ గ‌వ‌ర్న‌ర్‌ బండారు దత్తాత్రేయ తన పదవీకాలంలో అమలు చేసిన చారిత్రాత్మక కార్మిక సంస్కరణలను వివరించారు. సార్వత్రిక సామాజిక భద్రత, మానవ కేంద్రిత భవిష్యత్ ఉద్యోగ వ్యవస్థకు BRICS కార్మికుల సదస్సు పిలుపు భారత ప్రభుత్వం అమలు చేసిన చారిత్రాత్మక కార్మిక సంస్కరణలను వివ‌రించారు. ప్రసూతి ప్రయోజనాల చట్టాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచడం, కనీస వేతనాన్ని డియర్నెస్ అలవెన్స్తో కలిపి రూ.10,000 నుండి రూ.18,000కు పెంచడం, బోనస్ అర్హత పరిమితిని రూ.3,500 నుండి రూ.7,000కు పెంచడం, దేశంలోని సుమారు 60.5 శాతం మంది కార్మికులకు సామాజిక భద్రతను విస్తరించడం, అలాగే కార్మిక సంక్షేమం, శ్రమ చట్టాల ఆధునీకరణకు నాలుగు లేబర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం వంటి కీలక సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియస్ ఫోరం సమ్మిట్ ఛైర్మన్, భారతీయ మజ్జూర్ సంఘ్ ( BMS ) జాతీయ అధ్యక్షుడు సుంకరి మల్లేశం ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల ఐక్యత మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు భారతీయ మజ్జూర్ సంఘ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వలస కార్మికులకు ఎక్కడైనా అమలయ్యే పోర్టబుల్ సామాజిక భద్రత, BRICS AI అబ్జర్వేటరీ, BRICS స్కిల్స్ నెట్వర్క్ ఏర్పాటు అవసరాన్ని BMS అఖిల భారత సంస్థాగత కార్యదర్శి, BRICS ట్రేడ్ యూనియస్ ఫోరం ప్రధాన సమన్వయకర్త బి.సురేంద్రస్ వివరించారు. బ్రెజిల్‌కు చెందిన కార్లోస్ ఆగస్టో ముల్లర్, ఐఎలో ( ILO ) న్యూఢిల్లీ వర్కర్స్ స్పెషలిస్ట్ యుకి ఓట్సుజి, కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ( రిటైర్డ్ ) ఎన్.నాగరేష్, రష్యా ఎఫ్ఎస్పీఆర్ చైర్మన్ సెర్గీ చెర్నోగయేవ్, చైనా ప్రతినిధి హుక్సియాంగ్ జూ, దక్షిణాఫ్రికా ప్రతినిధి మసాలే గాడ్ ఫ్రే సెలెమత్సెలా వేదికను అలంకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఎంఎస్ మాజీ అధ్యక్షుడు హిరణ్మయ్ పాండ్యా, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర పాండే, బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.