కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ, జూలై 14, ( అద్దం న్యూస్ ) : రీజినల్ రింగ్ రోడ్డు ( RRR ) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తికావడమే కాకుండా నిర్మాణ వ్యయం తగ్గుతుందని వివరించారు. కేంద్ర మంత్రి గడ్కరీ తో ఢిల్లీలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిట నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్ – విజయవాడల మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్ట్‌కు వరకు రవాణా వేగవంతమవుతుందని తెలిపారు.
మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారికి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీ ని కోరారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ![]()












Leave a Reply