తెలంగాణను లూటీ చేసిన బీఆర్‌ఎస్ నేతలకు, కవితకు మాట్లాడే నైతిక హక్కు లేదు
– టీటీడీపీ నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం
హైదరాబాద్, జూన్ 4, ( అద్దం న్యూస్ ) : తెలంగాణను లూటీ చేసిన బీఆర్‌ఎస్ నేతలకు, కవితకు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు నల్లెల్ల కిషోర్ స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గురువారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు మాట్లాడుతూ… తెలంగాణ సమాజంలో మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణలో నిజమైన అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీయే అని వారు స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో నిజంగా అభివృద్ధి చేసింది, అంతర్జాతీయ పటంలో నిలిపింది తెలుగుదేశం పార్టీయేనని నల్లెల్ల కిషోర్ చెప్పారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాల పాటు ప్రజలను పీడించిన పటేల్–పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. అంతర్జాతీయ మౌలిక వసతులు కల్పించి హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది తమ పార్టీయేనని అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి కూడా తెలంగాణ అభివృద్ధిపై ఒక్కటంటే ఒక్క శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా ? అని ప్రశ్నించారు. చేతకాని దద్దమ్మలు బీఆర్‌ఎస్ నేతలని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత, ఆమె కుటుంబం తెలంగాణాను అందిన కాడికి దోచుకుందని నల్లెల్ల కిషోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ నాయకత్వం టీడీపీ భిక్షేనని ఎద్దేవా చేసారు. కవిత కుటుంబానికి చెందిన ముఖ్య నాయకులు ( ఆమె తండ్రి కేసీఆర్, బావ హరీష్ రావు ) అంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎదిగినవారేనని అన్నారు. కేటీఆర్ పేరు కూడా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్ఫూర్తితో పెట్టుకున్నవేనని గుర్తు చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం పార్టీ పేరు నుండి ‘తెలంగాణ’ అనే పదాన్ని తొలగించి ( TRS ను BRS గా మార్చి ), ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణ వాడుకుంటున్నారని, వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని నిలదీశారు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే, అమరవీరుల త్యాగాలను పక్కన పెట్టి, వారి శవాల మీద బీఆర్‌ఎస్ నాయకులు కుటిల రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు.
“మీకు దమ్ముంటే, మైకులు విరగ్గొట్టడం, సభలను అడ్డుకోవడం కాకుండా.. నేరుగా ప్రజా దర్బార్‌లోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి” అని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ప్రజల తీర్పు ఎప్పుడూ అంతిమమని, ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ నాయకులకు సరైన బుద్ధి చెప్పారని, రాబోయే రోజుల్లోనూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి నగర నాయకులు సుదర్శన్ తడక వినోద్, శ్యాంసుందర్, భాను ప్రకాష్, అనిల్ కురుమ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply