సామాజిక బాధ్య‌త‌తో బ‌స్సుల‌ను న‌డ‌పాలి – సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి

ముషీరాబాద్ ఆర్టీసి డిపోలో ఘ‌నంగా జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాలు
సామాజిక బాధ్య‌త‌తో బ‌స్సుల‌ను న‌డ‌పాలి
» జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాల్లో అధికారులు

 

హైదరాబాద్, జ‌న‌వ‌రి 2, అద్దం న్యూస్ :      డ్రైవ‌ర్లు ఒక సామాజిక బాధ్య‌త‌తో ఆర్టీసి బ‌స్సుల‌ను న‌డ‌పాలని సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ ముషీరాబాద్ ఆర్టీసి డిపోలో జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాలు ఘనంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి, చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్, ఆర్టీసి చార్మినార్ డివిజ‌న్ డిప్యూటీ రీజిన‌ల్ మేనేజ‌ర్ బాబు నాయక్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు ప్రమాదరహిత డ్రైవ‌ర్లను స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ మహంకాళి రామ్మూర్తి మాట్లాడుతూ… పొగమంచు ఉన్నప్పుడు, వర్షంలో, రాత్రి సమయాల్లో వాహనాన్ని చాలా జాగ్ర‌త్త‌గా న‌డ‌పాల‌ని సూచించారు. సుదీర్ఘ కాలం వాహనం నడిపే డ్రైవర్లు యోగా, ధ్యానం చేయాల‌ని, వాటి వ‌ల్ల డ్రైవ‌ర్ల‌ల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంద‌న్నారు.

ఆర్టీసి చార్మినార్ డివిజ‌న్ డిప్యూటీ రీజిన‌ల్ మేనేజ‌ర్ బాబు నాయక్ మాట్లాడుతూ… స్పీడ్ కంటే భ‌ద్ర‌త ముఖ్య‌మ‌న్నారు. డ్రైవ‌ర్లు ఎప్ప‌టికి సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయ‌కూడ‌ద‌న్నారు. ఒక్క సెకను అజాగ్రత్తగా ఉన్నా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందన్నారు. ప్రతి డ్రైవర్ తన సీటులో కూర్చున్నప్పుడు, వెనుక ఉన్న ప్రయాణికులు తన కుటుంబ సభ్యులే అని భావించాలని, నిబంధనలు పాటించడం భయం కోసం కాదు, బాధ్యత కోసం అని గుర్తుంచుకోవాల‌ని బాబు నాయ‌క్ డ్రైవ‌ర్ల‌కు సూచించారు. చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ… రోడ్డుపై క్రమశిక్షణ అనేది ప్రాణరక్ష కవచం వంటిదన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ఇతర వాహనదారులకు రోల్ మోడల్స్‌గా ఉండాల‌ని పేర్కొన్నారు. అతివేగం, అజాగ్రత్తగా ఓవర్ టేక్ చేయడం వల్లనే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా నియమాలు కేవలం చట్టాలు కావు, అవి మన ప్రాణాలను కాపాడే సూత్రాలన్నారు. ప్రయాణికులు క్షేమంగా ఇంటికి చేరినప్పుడే మీ డ్యూటీకి పూర్తి సార్థకత లభిస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ కండక్టర్ సోదర, సోదరీమణులు, ఇతర డిపో సిబ్బంది సూపర్‌వైజ‌ర్లు, సేఫ్టీ వార్డెన్ ఎస్‌డిఐ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page