వీధి కుక్కల నియంత్రణ పేరుతో జిహెచ్‌ఎంసిలో అవినీతి
– హెచ్‌సిఎఫ్, యుడిఎఫ్
హైదరాబాద్, డిసెంబర్ 7, అద్దం న్యూస్ : జిహెచ్‌ఎంసిలో వీధి కుక్కల నియంత్రణ పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని, వెటర్నరీ విభాగం పై జంతు ప్రేమికుల సంఘాల ఆధిపత్యాన్ని నివారించాలని హైదరాబాద్ సిటిజన్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ) , అర్బన్ డెవలప్ మెంట్ ఫోరం ( యుడిఎఫ్ ) డిమాండ్ చేశాయి. ఆదివారం హైదరాబాద్ హెచ్‌సిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్భన్ డెవలప్‌మెంట్ ఫోరం ( యుడిఎఫ్ ) కన్వీనర్ ఎం.శ్రీనివాస్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( హెచ్‌సిఎఫ్ ) అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల దాడిలో ఈ వారంలోనే ఇద్దరు బాలురు తీవ్రంగా గాయాల పాలయ్యారని… ప్రతినిత్యం ఇలాంటి ఘటనలు నగరంలో అనేకం జరుగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత కూడా గ్రేటర్ పరిధిలో వీధి కుక్కల నివారణపై తగిన చర్యలు లేవు. వెటర్నరీ విభాగం తమ బాధ్యతను వదిలించుకుని వీధి కుక్కల నిర్వహణ జంతు ప్రేమికుల సంఘాలకు, కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పజెప్పిందన్నారు. అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు కుమ్మక్కై కాకి లెక్కలు చెబుతూ నిధులన్నీ కాజేస్తున్నారని తెలిపారు. జిహెచ్‌ఎంసి వెటర్నరీ విభాగం పై జంతు ప్రేమికుల సంఘాల ఆధిపత్యం నడుస్తున్నదని, ఈ సంఘాలు చెప్పినట్టుగానే అధికార యంత్రాంగం పనిచేస్తున్నదన్నారు.
ప్రతి ఏటా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ వీధి కుక్కల నియంత్రణ జరగడం లేదు, స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ పేరుతో దొంగ లెక్కలు చెప్పి కాంట్రాక్టు ఏజెన్సీలు అధికారులు దోచుకు తింటున్నారని విమర్శించారు. ఒక్కో వీధి కుక్కపై 1500 రూపాయలను కాంట్రాక్ట్ ఏజెన్సీకి జిహెచ్‌ఎంసి చెల్లిస్తున్నదని, ఇంత భారీ చెల్లిస్తున్నప్పటికీ ఎందుకు నియంత్రణ జరగడం లేదని ధ్వజమెత్తారు. వీధి కుక్కల నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీల్లో ఎక్కువ భాగం జంతు ప్రేమికుల సంఘాలవే, ఈ సంఘాలు వీధి కుక్కల నుండి మనుషులను కాపాడడం కంటే వీధి కుక్కలకు రక్షణ మీదనే దృష్టి పెడుతున్నారని.. నిధులన్నీ కాజేస్తున్నారన్నారు.
2023 – 24 లెక్కలు :
గత ఐదేళ్లలో జిహెచ్‌ఎంసి లో వీధి కుక్కల నియంత్రణపై వెచ్చించిన నిధులు ఎన్ని ? వీధి కుక్కల సంఖ్య ఎంత తగ్గింది ? ఏ సంస్థలు కాంట్రాక్టులు తీసుకున్నాయి ? పబ్లిక్ ప్రదేశాలలో వీధి కుక్కల తొలగింపు పై సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారన్నారు. పూర్తి వివరాలతో సవివరమైన నివేదికను నగర ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.













Leave a Reply