- హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 9, అద్దం న్యూస్ : సైబర్ నేరాలపై అవగాహన రావాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలోని జలవాయు టవర్స్ సెమినార్ హాల్‌లో ఆదివారం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిజిపి శివధర్‌రెడ్డి హాజరై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి. సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిజిపి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ… ఈ అవగాహన కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం -సైబర్ నేరాల పెరుగుతున్న ముప్పు గురించి ప్రజలను చైతన్యపరచడం, డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తలు పాటించాలనే సురక్షిత ఆన్‌లైన్ సంస్కృతిని ప్రోత్సహించడం అని అన్నారు. సైబర్ నేరగాళ్లకు ప్రధాన అడ్డంకి ప్రజల అవగాహనే అని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బాధితుల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటల సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి క్యాంపెయిన్‌లను విస్తరించే ప్రణాళిక ఉందన్నారు.
ఎవరు ధనవంతులు, ఎవరు ఎక్కడ ఉంటారు, వయస్సు, లింగం వంటి వివరాలు తెలుసుకొని లక్ష్యంగా ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇది సాధారణ సమస్య కాదు, ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని అన్నారు. అవగాహన కార్యక్రమాలకన్నా, దీనిని ఒక మూవ్‌మెంట్‌గా తీసుకోవాలని సూచించారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ చాటింగ్‌ల ద్వారా నేరగాళ్లు సులభంగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. పాత నేరస్థుల మాదిరిగానే కొత్త సైబర్ నేరస్థులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారన్నారు.
యువత, రిటైర్డ్ వ్యక్తులు, ప్రముఖులు అందరూ ఈ అవగాహన కార్యక్రమంలో భాగం కావాలన్నారు. ఒకరు పది మందికి, పది మంది ఇరవై మందికి చెబితే ఇది పెద్ద మాస్ మూవ్‌మెంట్‌గా మారుతుందన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులు, గృహిణులు ఎక్కువగా లక్ష్యమవుతున్నారని, వంట చేస్తూ ఉండగా లేదా భయపెట్టి ఫోన్ మోసాలకు గురవుతున్నారని వివరించారు. ప్రజలు అత్యంత మెలుకువగా ఉండాల్సిన సమయం ఇది అని అన్నారు.
నగర కమిషనర్ విసి.సజ్జనార్ మాట్లాడుతూ… సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్లు జరుగుతున్నాయన్నారు. పెట్టుబడులు పెట్టే యాప్‌లలో కూడా ప్రజలు మోసపోతున్నారన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కొత్త మోసాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరు ఎంత ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చినా డబ్బులు ఉరికెరావు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు ఒక కోటి రూపాయల వరకు సైబర్ కేటుగాళ్లు దోచుకుంటున్నారని, ఏడాదికి 400 కోట్ల రూపాయల వరకు ప్రజలు నష్టపోతున్నారని వెల్లడించారు. ఏదైనా మోసం జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు నగరంలోని అన్ని డివిజన్‌లకు విస్తరించనున్నాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్) ఎం.శ్రీనివాస్, జాయింట్ సీపీ(ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్, డీసీపీ (సైబర్ క్రైమ్) ధార కవిత, అన్ని జోనల్ డిసిపిలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
