Friday, September 18, 2026
HomeGREATER HYDERABADడ్రైవర్లకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించాలి

డ్రైవర్లకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించాలి

డ్రైవర్లకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించాలి
– ప్రభుత్వ యాప్ తీసుకురావాలి 
 – తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం ( టీఏడీఎఫ్ ) వ్యవస్థాపకుడు షేక్ సలావుద్దీన్

హైద‌రాబాద్‌, జూలై 15, ( అద్దం న్యూస్ ) :   యాప్ ఆధారిత టాక్సీ, ఆటో, సరుకు రవాణా, డెలివరీ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు న్యాయమైన ఛార్జీలు నిర్ణయించి, కనీస ఆదాయానికి హామీ కల్పించాలి. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలి. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం ( టీఏడీఎఫ్ ) వ్యవస్థాపకుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం టీఏడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అత్తినమొని నాగేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి రౌండ్‌ టేబుల్ సమావేశంలో సలావుద్దీన్ మాట్లాడారు. యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, సరుకు రవాణా డ్రైవర్లు, డెలివరీ కార్మికుల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని తమ సమస్యలను వివరించారు. యాప్ ఆధారిత కార్మికులకు కిలోమీటరుకు, నిమిషానికి, ఆర్డర్‌కు నిర్ణయించే ఛార్జీలను తక్షణమే సవరించాలని, ఐటీ కంపెనీలు, అగ్రిగేటర్లు వసూలు చేస్తున్న అధిక కమీషన్లను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమ నిబంధనలను వెంటనే అమలు చేసి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. 

స్థానిక కార్మికులకు నష్టం కలిగించే అనధికార వెండర్లు, ఇతర రాష్ట్రాల వాహనాల వాణిజ్య కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ల ప్రయోజనాల కోసం సహకార సంఘం విధానంలో రూపొందిస్తున్న భారత్ టాక్సీ యాప్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ యాప్ పూర్తిగా డ్రైవర్లదేనని, ఛార్జీల నిర్ణయాధికారం కూడా డ్రైవర్లకే ఉంటుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను కలిసి తమ డిమాండ్లకు మద్దతు కోరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు స్పందించకపోతే జూలై 22న రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాష్ సమ్మె, అనంతరం ఆగస్టు 8 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ కార్మికుల జీవనోపాధిని పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే కార్మిక ప్రతినిధులు, ప్లాట్‌ఫామ్ సంస్థలతో చర్చలు జరపాలని సలావుద్దీన్ కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్, ఆర్కే రెడ్డి, సలీం, సంతోష్ గుప్తా, శివ, చిన్న, శ్రవణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page