...

ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర సహకారమే పారిశ్రామిక కుటుంబానికి పునాది – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా

ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర సహకారమే పారిశ్రామిక కుటుంబానికి పునాది
– తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా

హైద‌రాబాద్‌,  జూలై 15, ( అద్దం న్యూస్ ) :   ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, సంభాషణ, సహకారమే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా అన్నారు. భారత బ్రిక్స్ అధ్యక్షతలో భారతీయ మజ్జూర్ సంఘ్ ( BMS ) ఆధ్వర్యంలో నిర్వహించిన 15 వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ( BTUF ) సదస్సు–2026 బుధవారం హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా కార్మికుల హక్కులు, సార్వత్రిక సామాజిక భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సంభాషణ, సుస్థిర అభివృద్ధి పట్ల బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ల ఉమ్మడి నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్‌లో గల మారియట్ హోటల్‌లో జ‌రిగిన ఈ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ…. ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు కలిసే పారిశ్రామిక కుటుంబం అనే భావన పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణ ద్వారానే సాకారమవుతుందన్నారు. సాంకేతికత మానవాళికి సేవ చేయడంతో పాటు అసమానతలను పెంచకుండా ఉపాధి అవకాశాలను సృష్టించేలా అన్ని వర్గాలు కలిసి పని చేయాలని అన్నారు.

భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటని, బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభా, ఆర్ధిక ఉత్పత్తిలో గణనీయమైన వాటాను కలిగి ఉండటంతో మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలవని గవర్నర్ పేర్కొన్నారు. సాంకేతిక పురోగతి, డిజిటల్ పరివర్తన, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక మార్కెట్లను వేగంగా రూపాంతరం చేస్తున్నాయని ఆయన అన్నారు. బ్రిక్స్ సదస్సు–2026లో హైదరాబాద్ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. భారతీయ మజ్జూర్ సంఘ్ ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ అతిథులను స్వాగతిస్తూ, కార్మికుల హక్కులు, సార్వత్రిక సామాజిక భద్రత, సాంకేతిక పురోగతి, నైపుణ్యాభివృద్ధి, గౌరవప్రదమైన ఉపాధి, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై సదస్సులో సార్ధకమైన చర్చలు జరిగాయని తెలిపారు. సదస్సులో రూపొందించిన సిఫార్సులు, హైదరాబాద్ డిక్లరేషన్ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతీయ మజ్జూర్ సంఘ్ అధ్యక్షుడు ఎస్.మల్లేశం మాట్లాడుతూ… ఈ సదస్సు అందరికీ సార్వత్రిక సామాజిక భద్రత, మహిళా శ్రామిక సాధికారత, నైపుణ్యాభివృద్ధి పునర్నై పుణ్యాభివృద్ధి ఉన్నత నైపుణ్యాభివృద్ధి, మానవ కేంద్రిత కృత్రిమ మేధస్సు, శ్రమ భవిష్యత్తు అనే నాలుగు పరివర్తనాత్మక అంశాలపై దృష్టి సారించిందన్నారు. చివరిగా భారతీయ మజ్జూర్ సంఘ్ జాతీయ కోశాధికారి అనీష్ మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతాలాపనతో 15 వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ( BTUF ) సదస్సు-2026 విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు సమావేశానికి భారతీయ మజూర్ సంఘ్ అధ్యక్షుడు, సదస్సు చైర్మన్ ఎస్.మల్లేశం అధ్యక్షత వహించారు. వేదికపై బ్రెజిల్కు చెందిన కార్లోస్ ఆగస్టో ముల్లర్, రష్యాకు చెందిన సెర్గీ చెర్నో గాయేవ్, చైనాకు చెందిన హుక్సియాంగ్ జూ, దక్షిణాఫ్రికాకు చెందిన మసాలే గాడ్ సెలెమట్సెలా, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ప్రధాన సమన్వయకర్త బి.సురేంద్రన్, భారతీయ మజ్దాూర్ సంఘ్ కార్యదర్శి అంజలి పటేల్తో పాటు బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.