యూరియా కొరతతో అల్లాడుతున్న రైతాంగం
– కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి ఇదే నిదర్శనం
– తెలుగుదేశం నాయకుల ధ్వజం
హైదరాబాద్, జనవరి 3, అద్దం న్యూస్ : రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర యూరియా కొరతపై సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నదాతలు ఆకలితో కాకుండా, సాగు కోసం ఎరువుల కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని వారు మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, నాగు నగేష్, పి.బాలరాజ్ గౌడ్ లు మాట్లాడుతూ… యూరియా కోసం రైతులు తెల్లవారు జామున 5 గంటల నుండే క్యూలైన్లలో నిలబడుతున్నారన్నారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ చలిలో లైన్లలో ఎదురు చూస్తున్నా, యూరియా అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి హృదయ విదారకంగా ఉందన్నారు. సరైన సమయంలో యూరియా అందక పంటలు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశతో ఉన్న రైతులు ఆగ్రహంతో యూరియా సెంటర్లపై రాళ్ల దాడి చేయడం, దుకాణాల బోర్డులను తగులబెట్టడం వంటి ఘటనలు జరిగినా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని వారు దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై స్పందిస్తూ, ” షాపుల్లో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా ? ” అని నాయకులు ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి కాలం గడుపుతోందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లో లేని యూరియా సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా, ఆచరణలో ఫలితం శూన్యమని మండిపడ్డారు. ” ఆడ లేక మద్దెల ఓడు ” అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ ప్రేమ లేదని, దేశానికి అన్నం పెట్టే రైతులను అగచాట్ల పాలు చేయడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వారు ఆరోపించారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి, రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే యూరియా కొరతను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరుశు రామ్, ఎస్.ప్రకాష్, కరణం కిరణ్, భాను ప్రకాష్, తడక వినోద్, భవాని శ్రీనివాస్, జోగింధర్ సింగ్, శుక్రవేది, కార్తిక్, వై.లింగం తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply