...

రాష్ట్ర బడ్జెట్‌లో అన్ని వ‌ర్గాల‌కు నిధుల కేటాయింపు పెంచాలి – సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుధ‌వారం శాసనసభలో రూ.3,04,855 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌, ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టో అమలుకు, ప్రస్తుత ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ అన్నారు. హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల సిపిఎం ఎంబి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ముఖ్యంగా ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపులు గత సంవత్సరం కేటాయించిన దానిలో సగం కూడా ఖర్చుపెట్టలేదన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే ప్రతిపాదనలు ఉన్నాయని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని… మహిళలకు రు.2500లు ఇస్తామన పథకానికి నిధులు సరిపడా కేటాయించకుండా కేవలం రు.4 వేల కోట్లు కేటాయించారన్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలు ఇండ్లు లేనివారు ఉంటే కేవలం 4.50 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రతిపాదన పెట్టారన్నారు. దీని వల్ల ఈ సంవత్సరం కూడా అమలు జరగని పరిస్థితి కనపడుతుందని, వ్యవసాయ కూలీలకు రు.12 వేలు ఇస్తామని చెప్పారన్నారు.

40 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే కేవలం 5.50 లక్షల మందికే పరిమితం చేయడంతో వ్యవసాయ కూలీలకు అన్యాయం జరుగుతుందని, వ్యవసాయానికి గతంలో ఇచ్చినదానికి కూడా కోత పెట్టారన్నారు.  ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన నిధుల కేటాయిపుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌, చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌కు సంబంధం లేకుండా ఈ కేటాయింపులు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబానికి రు.12 లక్షలు ఇస్తామని చెప్పారన్నారు. ఈ బడ్జెట్‌లో ఆ వూసే లేదని.. కామారెడ్డిలో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని ఈ బడ్జెట్‌లో రు.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారని తెలిపారు. అసంఘటిత రంగం, ఆశా, అంగన్‌వాడీల వేతనాల పెంపుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, పోడు భూములు సాగుచేసుకున్నవారికి పట్టాలిస్తామన్నార‌ని.. గిరిజన గూడెం, తాండాల అభివృద్దికి రు.25 లక్షలు ఇస్తామన్నారు కానీ… ఆ వూసేలేదన్నారు.  కీలక రంగాలు, సంక్షేమ రంగాలకు కేటాయించిన పద్దులను అవసరానికి అనుగుణంగా పెంచకపోతే  ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత, ఉద్యమాలు, పోరాటాలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చ‌రించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.