...

వేసవిలో నీటి ఎద్దడికి ప్రభుత్వం చర్యలు శూన్యం  – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి నేతలు నల్లెల్ల‌ కిషోర్, పి.బలరాజ్ గౌడ్ ల‌ ధ్వజం

హైదరాబాద్‌ నగరంలో దోమలు విజృంభన
వేసవిలో నీటి ఎద్దడికి ప్రభుత్వం చర్యలు శూన్యం
 – కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి నేతలు నల్లెల్ల‌ కిషోర్, పి.బలరాజ్ గౌడ్ ల‌ ధ్వజం

హైదరాబాద్, ఫిబ్రవరి 27, అర్థం న్యూస్ :      రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దోమల నిలయంగా, తాగునీటి కటకటగా మార్చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లెల్ల‌ కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాలయంలో జ‌రిగిన స‌మావేశంలో వారు మాట్లాడుతూ…  గతేడాది అక్టోబర్‌లో ముగిసిన చెరువుల పునరుద్ధరణ చేపట్టక పోవడంతో చెరువులలో గుర్రపుడెక్క పేరుకుపోయి దోమల సంతతికి నిలయంగా మారిందన్నారు. ముఖ్యంగా మూసాపేట, మల్కాజగిరి, కూకట్‌పల్లి, అత్తాపూర్ ఉప్పల్ వంటి ప్రాంతాలు దోమల హాట్ స్పాట్లుగా మారి, ప్రజలు రాత్రి వేళల్లో నిద్రలేని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న ఫాగింగ్, యాంటీ లార్వా కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే ఉన్నాయన్నారు. సరిపడా ఫాగింగ్ మిషన్లు లేకపోవడం, వాడుతున్న రసాయనాలకు దోమలు అలవాటు పడటం వల్ల ఈ చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేని విధంగా దోమల బెడద తీవ్రతరమైందని, దీనికి ప్రభుత్వ పట్టింపులేని తనమే కారణమని నాయకులు దుయ్యబట్టారు. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ సెల్లార్లు, నాలాల్లో మురుగునీరు నిలిచిపోవడం దోమల వృద్ధికి ప్రధాన కారణమవుతోందన్నారు. ఫలితంగా నీలోఫర్, గాంధీ, ఫీవర్ హాస్పిటల్ లు రోగులతో కిక్కిరిసి పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు.

   గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు ఉండేవని, కానీ నేటి కాంగ్రెస్ పాలనలో నీటి మేనేజ్‌మెంట్ పూర్తిగా దిగజారిందని వారు విమర్శించారు. హైదరాబాద్‌లో రోజుకు 8,000 ట్యాంకర్ల అవసరం ఉంటే, ప్రజలు బుక్ చేసుకున్న తర్వాత కనీసం రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్– 2026 కాగితాలకే పరిమితమైందని, భూగర్భ జలాలు పడిపోతుంటే ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లను పక్కాగా అమలు చేసేవారని, ఎన్ఆర్ఈజిఎ వర్కర్లు, సివిక్ స్టాఫ్‌ను సమన్వయం చేసి నీటి సమస్య లేకుండా చూశారని వారు గుర్తు చేశారు.

యుద్ధ ప్రాతిపదికన చెరువుల నిర్వహణ కాంట్రాక్టులను పునరుద్ధరించి గుర్రపుడెక్కను తొలగించాలని, ప్రతి డివిజన్‌లో ఫాగింగ్ మిషన్ల సంఖ్యను పెంచి, నిరంతరం యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టాల‌ని డిమాండ్ చేశారు. తాగునీటి సరఫరా కోసం రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని డిమాండ్ చేసారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదుర్కోనక తప్పదని నల్లేల కిషోర్, పి.బలరాజ్ గౌడ్ లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు శ్యామ్ సుందర్, తడక వినోద్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.