ఆహార కల్తీపై కఠిన వైఖరి
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు
» హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక
» ఆహార కల్తీ నిరోధానికి పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారుల సన్నాహక సమావేశం
హైదరాబాద్, జనవరి 7, అద్దం న్యూస్ : నగరంలో ఆహార కల్తీని ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన తెలిపారు. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో నగర సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీసి సజ్జనార్ మాట్లాడుతూ… ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే ‘ హత్యాయత్నం ‘ గానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ‘ను రూపొందించి.. అమలు చేస్తామని తెలిపారు. ఆహార కల్తీ నియంత్రణలో క్షేత్రస్థాయి సవాళ్లు, చేపట్టాల్సిన చర్యలపై పోలీసు, ఆహార భద్రత అధికారులతో సీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని.. కల్తీ నివారణకు ఎస్వోపీ రూపొందించి, అమలు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్ చేయడం, అరెస్టుల ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామన్నారు.
వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకువస్తున్నట్లు సీపీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ( క్రైమ్స్ ) శ్రీనివాసులు, జాయింట్ సీపీ ( ట్రాఫిక్ ) జోయల్ డెవిస్, డీసీపీలు శ్వేత, అపూర్వ రావు, రూపేష్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో పాటు ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, డీఎఫ్సీ ( రిటైర్డ్ ) విజయ్ కుమార్, ఏఎఫ్‌సీలు బాల్ రాజు, ఆనంద రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ జగ్గా రెడ్డి, అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply