Saturday, September 19, 2026
No menu items!
HomeNationalIND w Vs SL: నేడు శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్

IND w Vs SL: నేడు శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జోరుమీదున్న టీమ్ ఇండియా మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొంటుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకను 121/6కు కట్టడి చేసినప్పటికీ భారత జట్టు ఫీల్డింగ్, ముఖ్యంగా క్యాచింగ్‌ మెరుగుపడాల్సివుంది. తొలి మ్యాచ్‌లో జట్టు అయిదు క్యాచ్‌లు చేజార్చింది. ‘‘మేం మా ఫీల్డింగ్‌ మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టాం. పదే పదే ఎందుకు క్యాచ్‌లు చేజారుస్తున్నామో అర్థం కావట్లేదు. వచ్చే మ్యాచ్‌లో మెరుగ్గా ఫీల్డింగ్‌ చేస్తాం’’ అని తొలి టీ20 అనంతరం హర్మన్‌ప్రీత్‌ వ్యాఖ్యానించింది.

ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు ఆరు వారాల విరామం లభించింది. విరామం వచ్చిన నేపథ్యంలో క్రికెటర్లు ఫీల్డింగ్‌లో లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చు. ఫీల్డింగ్‌లో ఇబ్బందులున్నా.. రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచకప్‌ ఫామ్‌ను కొనసాగించిన జెమీమా రోడ్రిగ్స్‌.. తొలి టీ20లోనూ అదరగొట్టింది. ఆమె అదే జోరును కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది.

ఓపెనర్‌ షెఫాలి వర్మకు ఈ సిరీస్‌ ఎంతో ముఖ్యమైంది. తన ఆటకు సరిపోయే ఈ ఫార్మాట్లో ఆమె నిలకడను అందుకోవాల్సివుంది. ఇంకా స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మలతో భారత జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. బంతితో మరోసారి లంకను దెబ్బతీయడానికి భారత్‌ సిద్ధమవుతోంది.

గత మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్‌ వైష్టవి శర్మ ఆకట్టుకుంది. వికెట్లు పడగొట్టకున్నా.. కేవలం 16 పరుగులే ఇచ్చింది. ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. దీప్తి శర్మ, శ్రీచరణిలతో ఆమె స్పిన్‌ భారాన్ని పంచుకోనుంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం లేదు. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఆ జట్టును అడ్డుకోవడం చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంకకు సవాలే. లంకతో ఆడిన గత పది టీ20ల్లో భారత్‌ ఎనిమిది గెలవడం విశేషం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page