హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : రాబోయే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని భట్టివిక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్‌టి రామారావు 102 వ జయంతి సందర్భంగా ఈ నెల 28 వ తేదీన జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. బుధవారం దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఇప్పటికిప్పటికి ఎన్నికలను నిర్వహిస్తే, రేపే మీ పరిస్థితి బట్టబయలవుతుందనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను గత ఆరేడు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారని విమర్శించారు. రేపు రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను కూడా వాయిదా వేస్తారనడంలో సందేహం లేదని సాయిబాబా అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలను ఏ విధంగా వాయిదా వేయాలో ఇప్పటి నుండే ప్రణాళికలను చేస్తున్న కాంగ్రెస్‌కు దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సాయిబాబా సవాల్ విసిరారు. పదేళ్ల పాటు మేమే ఉంటామని పగటి కలలు కనవద్దని, వాస్తవాలను గమనించాలని, వాపును చూసి బలుపు అనుకోవద్దు అని అన్నారు. అందాల పోటీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. అనేక మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అల్లాడుతుంటే కనీసం వారి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అందాల పోటీలను నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. ఒకవైపు పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగే 17 మంది అగ్నికి ఆహుతి అయితే కనీసం ఒక్క మంత్రి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఇన్చార్జ్ మంత్రులకు పరామర్శించే తీరిక లేకుండా పోయిందని మండిపడ్డారు. “గ్రామ స్వరాజ్యమే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలని” గాంధీ మహాత్ముడు చెపితే, గాంధీ వారసులుగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది గ్రామాలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా ప్రత్యేక అధికారులతో గ్రామ వ్యవస్థను దోపిడీ చేస్తున్నారని సాయిబాబా అన్నారు. ఈ విధంగా ప్రజలను వంచిస్తూ పదేళ్లు మేమే అధికారంలో ఉంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎన్‌టిఆర్ 102వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడుగా నిర్వహించడం ఆనవాయితి అని అన్నారు. ఈసారి కడపలో జరిగే మహానాడు – 2025 నిర్వహణ కమిటీలను అధిష్టానం ఇటీవలే విడుదల చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు శ్రేయోభిలాషులు మహానాడు–2025 కు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సాయిబాబా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, టిడిపి నాయకులు ఎస్.ప్రకాష్, కిరణ్, తడక వినోద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply