హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరమని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి. సాయిబాబా అన్నారు. మంగళవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ఏటా కొంత నిధులను కేటాయిస్తుంది. గత పదేళ్లలో వీటి కోసం ఎంత ఖర్చు చేసిందో ఆర్టీఐ వెల్లడించింది. 2014-2025 మధ్య కాలంలో సంస్కృత భాష కోసమే ఏకంగా రూ.2,532 కోట్లు ఖర్చు చేస్తే, ఉర్దూ కోసం రూ.838 కోట్లు, హిందీకి రూ.426 కోట్లు, తమిళం కోసం రూ.120 కోట్లు, సింధీపై రూ.54 కోట్లు ఖర్చు చేస్తే. తెలుగు భాషపై కేవలం రూ.12.65 కోట్లు మాత్రమే వినియోగించిందని ఆర్టీఐ లో వెల్లడించిందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తెలుగును అధికార భాషగా గుర్తించి, తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని గుర్తు చేశారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే తెలుగు భాష. అటువంటి తెలుగు భాషను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగును చిన్నచూపు చూస్తుందన్నారు. గతంలో ఎన్టీఆర్ ఏ పథకం చేపట్టినా తెలుగు భాషను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు అనే పదంతో మొదలు పెట్టేవారని తెలిపారు. తెలుగు గంగ, తెలుగు లలిత కళా తోరణం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు కళామూర్తుల నిక్షిప్త ప్రాంగణం ఇలా సాధ్యమైనంత వరకు తెలుగుకు ప్రోత్సాహమిచ్చారన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఎన్‌టిఆర్ ఆశయాలను కొనసాగిస్తూ అధికారంలో ఉన్నంత కాలం తెలుగు కోసం పాటు పడ్డారు… కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయినా తర్వాత నుండి గత బిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత కాంగ్రెస్ లు తెలుగును చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. కనీసం తెలుగు భాషను పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. గత బిఆర్ఎస్ పార్టీ తెలుగును ఎలా నిర్వీర్యం చేస్తూ చులకన చేసిందో, అదే పంథాను కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తూ తెలుగును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. భారతీయ భాషలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగ పరుచుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేపట్టడం లేదని విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి తెలుగు భాషకు పూర్తి న్యాయం చేయాలని సాయిబాబా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెలకిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయకుడు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply