హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : కుటుంబ కలహాలతో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సీనియర్ జర్నలిస్టు, టీవీ యాంకర్, కవయిత్రి స్వేచ్ఛ అంత్యక్రియలు శనివారం జరిగాయి. స్వేచ్ఛ అకాల మరణం విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, పలు పత్రికల సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, అభ్యుదయవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ పార్శిగుట్ట వద్ద వైఎస్ఆర్ పార్కు సమీపంలో ఉన్న స్వేచ్ఛ ఇంటి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మందుల సామేలు, ఎమ్మెల్సి గోరటి వెంకన్న, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, పీవోడబ్ల్యూ నాయకులు సంధ్య, అనురాధ, అనసూయ, సీపిఐ ( ఎంఎల్ ) న్యూడెమోక్రసి నాయకులు గోవర్థన్, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు హాజరై స్వేచ్చ భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్శిగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. ఇదిలా ఉండగా స్వేచ్ఛ నేత్రాలను ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసినట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
పూర్ణచందర్ నాయక్‌ను కఠినంగా శిక్షించాలి : స్వేచ్చ తండ్రి శంకర్
తమ కూతురు ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ నాయకే అని స్వేచ్ఛ తండ్రి శంకర్ కోరారు. శనివారం పార్శిగుట్ట వద్ద గల స్వేచ్చ అంత్యక్రియలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ… శుక్రవారం సాయంత్రం స్వేచ్చ తనకు ఫోన్ చేసిందని, పూర్ణచంద్రుతో విడిపోతున్నానని, వచ్చి మాట్లాడు అని చెప్పిందన్నారు.
స్వేచ్ఛ కు నివాళులర్పించిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు :
సీనియర్ జర్నలిస్టు, టీవీ యాంకర్, కవయిత్రి స్వేచ్ఛ అకాల మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. శనివారం ఆయన హైదరాబాద్ పార్శిగుట్టలో స్వేచ్ఛ బౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. మామిడి సోమయ్యతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు ఆనందం, రఘు, రాజశేఖర్, కార్యదర్శి సలీమా తదితరులు స్వేచ్ఛ బౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ… మీడియారంగంలో చురుకైన జర్నలిస్టుగా, రచయితగా ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్న స్వేచ్ఛ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేక పోతున్నామని అన్నారు. స్వేచ్ఛ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛ మరణంతో రాష్ట్రం ఒక మంచి మహిళా జర్నలిస్టును కోల్పోయిందని అన్నారు. స్వేచ్ఛ మరణం సమాజానికి తీరని లోటని ఆయన పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. అదే విధంగా స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply