
హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ రక్షణ చర్యలకే పంపిన 42 శాతం ఓబిసి రిజర్వేషన్ చట్టం తక్షణ అమలుకై అవసరమైన యుద్ధ కార్యాచరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మహా దీక్ష జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సి మధుసూదనచారి, సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, మాజీ ఎంపి వి.హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్.వినయ్, బిసి నాయకులు కోల జనార్థన్, సిపిఎం నాయకుడు బండారి రవి కుమార్, బిజెపి నాయకుడు ఆనంద్ గౌడ్, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్, సమన్వయకర్త గుజ్జ కృష్ణ, లోక్‌సత్తా నాయకుడు నాగరాజు, బిసి నాయకులు డి.నరహరి, పాల్వాయి శ్రీనివాస్, రాములు, నాగుల శ్రీనివాస్, సరోజ, రజిని, విమల, పద్మావతి, నందగోపాల్, వేముల రామకృష్ణ, సుధాకర్, శ్రావణి, జగదీష్ యాదవ్, సతీష్, వంశీకృష్ణ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సి మధుసూదనచారి, సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, మాజీ ఎంపి వి.హనుమంతరావు లు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని బిజెపి యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో రాజకీయ లబ్ది కోణంలో కాకుండా సుదీర్ఘకాల బీసీల ఈ ప్రధాన డిమాండ్ అవసరమైన చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈ అంశం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కై సిద్ధమై ఉన్నందున తక్షణమే రాజ్యాంగ రక్షణ చర్యలు చేపట్టి బీసీలకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ హామీ అమలుకై జీవో ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోదామని ప్రయత్నించినా, రిజర్వేషన్ల పెంపు లేకుండా పాత పద్ధతిలో ఎన్నికలకు పోదామని ప్రయత్నించినా ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని హెచ్చరించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ… 1986లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం జీవో ద్వారా 44 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు, విద్య, ఉద్యోగ రంగాలలో ఇచ్చినా కోర్టులు కొట్టివేసిన ఉదంతాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి న్యాయబద్ధతతో కూడిన తమిళనాడు కూడిన (ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలు తరహాలో) చట్టం చేయించి (రాజ మార్గంలో) తమ నిజాయితీని చూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ రాజకీయ లబ్ది వైఖరి తక్షణమే విడనాడాలని, లేని పక్షంలో తాము తీసుకునే ఉద్యమ కార్యాచరణ, ప్రజాభిప్రాయానికి బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య ఉపాధి రంగాలలో ఈ రిజర్వేషన్ల అమలుకై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ కార్యాచరణ చేపట్టాలని.. లేకుంటే ఈ దీక్షలు రాష్ట్ర వ్యాప్త దీక్షలుగా, ఆమరణ నిరాహార దీక్షలుగా చేపట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

