...

తెలంగాణ ప్రభుత్వానికి, థూరింగియా ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

తెలంగాణ ప్రభుత్వానికి, థూరింగియా ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

తెలంగాణ బ్యూరో, జూన్ 3, ( అద్దం న్యూస్ ) :  రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వానికి, జర్మనీకి చెందిన థూరింగియా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం ( MOU ) కుదిరింది. భారత్ పర్యటనలో భాగంగా థూరింగియా రాష్ట్ర మినిస్టర్– ప్రెసిడెంట్ మారియో ఫోకట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే థూరింగియా ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. దేశంలోనే అభివృద్ధి, ఆవిష్కరణలకు తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని ఈ సందర్భంగా మారియో ఫోకట్ గారు వ్యాఖ్యానించారు. భారత్–జర్మనీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భాగస్వామ్యం మరింత బలోపేతమవుతున్న తరుణంలో తాజా ప్రస్థానంతో తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలు కల్పించే అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అభిలషించారు.

కృత్రిమ మేధస్సు ( AI ) యుగంలో మారుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాల్సిన ఆవశ్యకతను సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల అవసరాలను తీర్చగల విధంగా స్కిల్లింగ్ కార్యక్రమాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ( YISU ), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ( ATCs ), పాలిటెక్నిక్ విద్యాసంస్థల పాఠ్యాంశాలను ఆధునీకరించడంలో థూరింగియా సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. సానుకూలంగా మంత్రి-ప్రెసిడెంట్ మారియో ఫోకట్ లు స్పందించారు. తెలంగాణ–థూరింగియాలోని ప్రముఖ పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో అవసరాల ఆధారిత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను సంయుక్తంగా రూపొందించవచ్చని చెప్పారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ… స్పందిస్తూ, ప్రపంచ సాంకేతిక రంగం అభివృద్ధిలో, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రాల్లో తెలంగాణకు చెందిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రముఖ వ్యాపార నాయకులకు హైదరాబాద్‌తో బలమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జర్మన్ వంటి విదేశీ భాషల్లో శిక్షణను ఇవ్వడంతో పాటు స్కిల్స్ పెంపొందించడానికి శిక్షణలో సమగ్ర మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. థూరింగియా రాష్ట్ర సహకారంతో హైదరాబాద్‌లో జర్మన్ భాషా శిక్షణ కేంద్రం ( German Language Training Hub ) ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. జర్మనీ పరిశ్రమలకు భవిష్యత్తులో అవసరమయ్యే మానవ వనరులను గుర్తిస్తే, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆ అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను అందించగలదని సూచించారు.

భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. ఫార్చూన్ – 500 కంపెనీలను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ప్రాంతీయ భౌగోళిక-రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ 2025 మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా 100కు పైగా దేశాల ప్రతినిధులకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జర్మనీకి చెందిన సెమీకండక్టర్ కంపెనీల ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని తెలంగాణకు అధికారికంగా తీసుకొచ్చి పెట్టుబడి అవకాశాలను పరిశీలించడంతో పాటు పరిశ్రమల మధ్య భాగస్వామ్యం కల్పించేలా ప్రోత్సహించాలని మంత్రి -ప్రెసిడెంట్ మారియో ఫోకట్ ప్రతిపాదించారు. తెలంగాణ పరిశ్రమల అవసరాలను తీర్చడం, పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడంలో థూరింగియా కట్టుబడి ఉందని చెప్పారు.

మంత్రి శ్రీధర్ బాబు ఆ ప్రతిపాదనను స్వాగతించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ… తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ ( TOMCOM ) ద్వారా జర్మన్ భాషలో శిక్షణ, విదేశీ ఉపాధి అవకాశాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సమావేశంలో థూరింగియా రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యదర్శులు ప్రొఫెసర్ టైకుర్ట్, షూకర్ట్, చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆప్టిక్స్, ఫోటోనిక్స్, ప్రిసిషన్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్, రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశాంక తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.