కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలి
– ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, జులై 29, అద్దం న్యూస్ : కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ సిటీ ఏరియాలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలతో పాటు పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, మూసీ రివర్ ఫ్రంట్, మిరాలం ట్యాంక్ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో తలెత్తకూడదని అన్నారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఆ ప్రణాళికలు రూపొందించడంలో ఆయా మహానగరాల్లో ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. “నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను సిటీలో ఎక్కడపడితే అక్కడ డంప్ చేయకుండా చూడాలని నిఘా పెట్టాలని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా, సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బోర్డు తమకున్న వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొదించుకోవాలన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేలా కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దానిని మరింత బలోపేతం చేయాలన్నారు.
పాతబస్తీలో మెట్రో పనులకు అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున అక్కడ మెట్రో పనులు వేగవంతం చేయాలని, మెట్రో ఇతర ఫేజ్‌ల అనుమతులు, తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యాన్ని సహించేది లేదన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని, ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు సంబంధించి హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో మూసీ రివర్ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ప్రత్యేకత కలిగిన ఒక ల్యాండ్ మార్క్‌ను నిర్మించాలని సూచించారు. మూసీపైన బ్రిడ్జి కం బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో టూరిజం ప్లాజా నిర్మించాలని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply