ప్రజాపాలన ఉత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ప్రజాపాలన ఉత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 1, అద్దం న్యూస్ :   ఆచరణకు నోచుకోని ఆరు హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ ప్రజాపాలన ఉత్సవాలు ‘ కేవలం ‘ ప్రజా వంచన ఉత్సవాలే ‘ అని తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తోందని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక ఈ విందులు, వినోదాల వైపు మొగ్గు చూపుతోందని ఆయన విమర్శించారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని ధ్వ‌జ‌మెత్తారు. రుణమాఫీపై అస్పష్టత లేద‌ని, ఏ రైతుకు రుణమాఫీ చేశారో, ఎంత మొత్తంలో చేశారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేక పోవడం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడమే అవుతుంద‌న్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు మాట ఎక్కడికి పోయింది ? పాత వాటిని కూడా సగం ఇచ్చి, సగం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒకమాట చెప్పి, ఇప్పుడు నామమాత్రంగా పెన్షన్లు పెంచడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ప్రతి మహిళకు రూ. 2,000, కల్యాణలక్ష్మి పథకం పంపిణీ వంటి కీలక వాగ్దానాలను తుంగలో తొక్కి, ఇప్పుడు రెండేళ్ల పాలనలో ఏంసాధించారని అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమ‌ర్శించారు. బీసీ రిజర్వేషన్లపై హైడ్రామా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల నిలదీస్తారని భయపడి, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ విధంగా హడావిడి చేస్తోందని సాయిబాబా ఆరోపించారు.

                               స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని, వారి నిజాయితీ ఏమిటో ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్లో భ్రమలు పుట్టించి, రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సాగవని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అగమ్యగోచరంగా తయారైందని, రాష్ట్రంలో అప్పులు తారస్థాయికి చేరాయని సాయిబాబా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాలు సైతం సమయానికి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏమి ఉంది, ఏమి లేదు అనే దానిపై ప్రజలకు పూర్తి అంధకారం నెలకొందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సాయిబాబా డిమాండ్ చేసారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన మంత్రులు, తమ సొంత ప్రయోజనాలు, పదవుల కోసం పరస్పరం కొట్లాడుకుంటున్నారని సాయిబాబా విమర్శించారు. ఒకవైపు సంక్షేమాన్ని గాలికొదిలేసి, మరోవైపు ‘ ప్రజాపాలన ఉత్సవాల ‘ పేరుతో విందులు, వినోదాల కోసం ప్రజాభవన్ వంటి ప్రభుత్వ భవనాలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వమే కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాష్ట్రానికి పట్టిన ఈ ‘ పీడ ‘ ఎప్పుడు వీడుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ‘ప్రజావంచన’ను ప్రజలు గ్రహించాలని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మరొక్కసారి మోసం చేయాలని చూస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page