2 లక్షల జాబ్స్ నోటిఫికేషన్‌ను ప్రకటించాలి
– రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, మే 26, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై ప్రకటన విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… రాష్ట్రంలో 9 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ 23 జిల్లాలోని వాటిలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, అలాగే పెద్ద ఎత్తున తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయన్నారు. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 25 డిఎస్‌పి ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలీస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయని, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయలేదని… వీటికి పోస్టులు వెంటనే మంజూరు చేయాలన్నారు. వీటికి అన్ని స్థాయిలలో పోస్టులు మంజూరు చేస్తే దాదాపు లక్ష పోస్టులు అదనంగా వస్తాయని, ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా లెక్కించాలని, వాటిలో గ్రూప్-1 50 శాతం, గ్రూప్-2 లో 30 నుంచి 40 శాతం గ్రూప్-4 తదితర పోస్టులు 100 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తీ స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖలో 18 వేలు, విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాలలో 12 వేల, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదర్శ గురుకుల పాఠశాలలో 8 వేలు, ఆదర్శ పాఠశాలలో కస్తూరిబా పాఠశాలలో 3 వేల, ఎయిడెడ్ పాఠశాలలో 6 వేల ఇలా మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో పాఠశాలలో 30 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. గ్రూప్-1 1600, గ్రూప్-2 3000, గ్రూప్-3, 4 10,000 పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని 14 యూనివర్శిటిలో 3 వేల లెక్చరర్ పోస్టులు, 4 వేల నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, విద్యుత్ శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీకై జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనసు రాని రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల భూములను కబ్జాలు చేయడం వస్తుందని ఆరోపించారు. మంత్రులందరూ అవినీతికి పాల్పడుతున్నారని, అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ప్రత్యక శ్రద్ద తీసుకోవాలని కోరారు. ప్రైవేటు రంగం ఐటి తదిదర ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖలలో ముఖ్యంగా విద్య, వైద్యం, రెవిన్యూ, పంచాయత్ రాజ్ శాఖ ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కోరారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే ముఖ్యమంత్రి నివాసం ముట్టడిస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసి చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్ రాజ్, కార్యదర్శి అంజి గౌడ్, నిఖిల్ పటేల్, నందిని తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply