పాత సర్వీస్ రూల్స్‌ను రద్దు చేయాలి
– ఎమ్మెల్సీలు కోదండరాం, మల్కా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, మే 30, ( అద్దం న్యూస్ ) : పాత ఇంటిగ్రేటెడ్ సర్వీస్ రూల్స్‌ను పూర్తిగా రద్దు చేసి తెలంగాణకు అనుగుణంగా కొత్త విద్యా సేవా నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్సీలు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య లు డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘం ( టీఎస్ జిహెచ్ఎంఏ ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద శనివారం మహాధర్నా నిర్వహించారు. టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రాజా గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు కోదండరాం, మల్కా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి, అరుణ్ కుమార్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సదానంద గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిలిచిపోయిన పదోన్నతులు, ప్రధానోపాధ్యాయుల బదిలీలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమర్థత పెంచేందుకు ప్రతి నాలుగు నుంచి ఐదు మండలాలకు ఒక విద్యా డివిజన్ ఏర్పాటు చేసి, డివిజనల్ విద్యాధికారులను పదోన్నతుల ద్వారా నియమించాలని సూచించారు.
మండల విద్యాధికారి పోస్టుకు ఉన్నత హోదా కల్పించి ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. పదోన్నతుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడిన పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గిరిధర్ గౌడ్, కోశాధికారి తుకారం, మురళీకృష్ణ, లక్ష్మణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply