📰 Generate e-Paper Clip
పోయాం మోసం..
పబ్లిసిటీ కోసమే బంగారు, డైమండ్లతో వినాయకుడని ప్రచారం
– అసత్య ప్రచారాలను నమ్మొద్దంటున్న గోషామహల్ పోలీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితి రోజు నుంచి బేగంబజార్ ఫీల్‌ఖానాలోని 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు రూ.3 లక్షల 80 వేల విలువైన అమెరికన్ డైమండ్లతో వినాయకుడి ప్రతిష్టించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమైంది. దీంతో అన్ని ప్రధాన న్యూస్ ఛానెళ్లతో పాటు ప్రముఖ దిన పత్రికల్లో సైతం ఆ బంగారం, డైమండ్స్ తో చేసిన వినాయకుడి వార్తను, కథనాలను ప్రచురితం చేశారు. ఇప్పుడు తాజాగా అదంతా ఉత్తదే అని తేలింది. అది కేవలం ” LEE CHEE PEARLS AND JEWELS ” కు ఉచిత పబ్లిసిటీ, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి, ప్రజలను భ్రమలో నెట్టి అక్రమంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఈ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించి వ్యాప్తి చేశారని గోషామహల్ పోలీసులు గుర్తించారు. ఈ నేపధ్యంలో గోషామహల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్ అధికారికంగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ” లీ చీ కా రాజా గణేష్ – 2026 ” విగ్రహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు, అసత్య ప్రచారాలపై స్పష్టతతో పాటు హెచ్చరికలు జారీ చేశారు.
గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ” లీ చీ కా రాజా గణేష్ – 2026 ” విగ్రహం గురించి గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ( ట్విట్టర్ ) వంటి వివిధ సోషల్ మీడియా వేదికలలో అనేక వార్తలు, ఫోటోలు, వీడియోలు విపరీతంగా ప్రచారమవుతున్నట్లు గోషామహల్ పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం :
ప్రచారంలో ఉన్న సందేశాల ప్రకారం..ఈ గణేష్ విగ్రహాన్ని సుమారు 48 కిలోల పంచలోహాలతో తయారు చేశారని, దానిపై 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత పూశారని, 3,83,800 అమెరికన్ డైమండ్లను అమర్చారని పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ” 24 క్యారెట్ల బంగారు పూత ” అనే అంశాన్ని పదే పదే హైలైట్ చేస్తూ ప్రచారం చేయడం వల్ల, ఈ విగ్రహం నిజంగానే కోట్లాది రూపాయల విలువైన బంగారంతో తయారైందనే తప్పుడు అభిప్రాయం సాధారణ ప్రజలలో ఏర్పడుతోంది.
గోషామహల్ పోలీసుల అధికారిక స్పష్టత :
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఈ ప్రచారాలన్నీ పూర్తిగా అసత్యమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని గోషామహల్ పోలీస్ స్టేషన్ అధికారికంగా స్పష్టం చేస్తోంది. స్థానికంగా ప్రతిష్టించిన ఈ గణేష్ విగ్రహాన్ని ప్రచారంలో పేర్కొన్నటువంటి విలువైన లోహాలు లేదా బంగారం పూతతో తయారు చేయలేదు. ముఖ్యంగా, విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూత పూశారనడంలో ఎలాంటి నిజం లేదు.
వ్యాపార స్వలాభం కోసం చేసిన కుట్ర :
పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే—”లీ చీ కా రాజా గణేష్” ఉత్సవ కమిటీకి చెందిన కొందరు సభ్యులు మరియు నిర్వాహకులు తమ సొంత వ్యాపార సంస్థ అయిన “LEE CHEE PEARLS AND JEWELS” కు ఉచిత పబ్లిసిటీ, ప్రచారం కల్పించుకోవడానికి, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి, ప్రజలను భ్రమలో నెట్టి అక్రమంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఈ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించి వ్యాప్తి చేశారు.
అమాయక ప్రజలకు అత్యంత ముఖ్యమైన మనవి :
ఇలాంటి అతిశయోక్తి, ఆధారాలు లేని సమాచారాన్ని నమ్మడం వల్ల అమాయక ప్రజలు మోసపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, విగ్రహం విలువపై అనవసరపు అంచనాలు పెరిగి ఉత్సవాల సమయంలో భద్రతా పరమైన సమస్యలు, గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కావున ప్రజలు, భక్తులు ఈ క్రింది జాగ్రత్తలు వహించాలని పోలీసులు కోరుతున్నారు.
నమ్మవద్దు – షేర్ చేయవద్దు : వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లేదా ఇతర ఏ సోషల్ మీడియా మాధ్యామాలల్లో వచ్చే ఆధారాలు లేని వార్తలను, ఫోటోలను, వీడియోలను అస్సలు నమ్మవద్దు, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
అధికారిక వివరాలనే నమ్మండి :
పంచలోహాలు, విగ్రహం బరువు, డైమండ్ల సంఖ్య లేదా 24 క్యారెట్ల బంగారు పూత అంటూ వచ్చే ప్రచారాలను నమ్మకుండా, కేవలం పోలీసులు, అధికారిక వర్గాలు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి.
చట్టపరమైన చర్యలు : సోషల్ మీడియాలో నిజా నిజాలు పరిశీలించకుండా పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గోషామహల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.
విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, తప్పుడు వార్తలు, పుకార్ల నివారణకు పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రజలందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్ కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png